Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడుగులపల్లి
మండలంలోని పాములపాడు గ్రామంలో 2008 వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాజీవ్ విద్యా మిషన్ సక్సెస్ పథకం కింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆంగ్ల మాధ్యమం కోసం విద్యాశాఖ మంజూరు చేసిన నూతన భవన నిర్మాణం సుమారు 14 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అసంపూర్తిగా ఉంది. ఎలాంటి గోడలు, పైకప్పు, కిటికీలు లేకుండా నిర్మానుష్యంగా ఉండడం వల్ల విద్యార్థులకు పాఠశాలలో సరియైన తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద కూర్చోవలసి వస్తుంది. ఈ విషయంపై గతంలో పలుమార్లు విద్యాశాఖ ఏఈకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని అసంపూర్తిగా ఉన్న భవనం త్వరితగతిన పూర్తి చేసి పిల్లలకు లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, స్టడీ రూమ్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
ఏర్పుల వెంకటయ్య (సోషల్ వర్కర్)
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సక్సెస్ పథకం కింద మంజూరైన పాఠశాల భవనాన్ని అసంపూర్తిగా నిరుపయోగంగా ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు ఈ పాఠశాలపై దృష్టి సారించి నిర్మాణాన్ని పూర్తి చేయాలి.
అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తాం
బాలాజీ నాయక్ (ఎంఈఓ)
సర్వ శిక్ష అభియాన్ నుంచి సమగ్ర శిక్ష అభియాన్‌కు పథకం మారడం వల్ల అప్పుడున్న బడ్జెట్‌కు పథకం మారడంతో భవనాలు అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇలా అసంపూర్తిగా ఉన్న భవనాలు మండలంలో ఎక్కడ ఉన్నా కూడా పూర్తి చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. వీలైనంత తొందరగా అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తాం.