Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజారాతీలకు 19 లక్షల కోట్లు దోచిపెట్టారు
- బీజేపీ పంచన చేరిన రాహుల్
- దేశం యావత్ బీఆర్ఎస్ వైపే
- సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్య్ర నిర్మూలన
- కేంద్రంపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపాటు
నవతెలంగాణ-నల్లగొండ
ప్రధాని మోడీ మోసం బట్టబయలయిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచాడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది మహిళలు ఖాళీ సిలిండర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్ద గడియారం చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. యావత్ భారత దేశంలో ప్రజల నుండి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతిలకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును ఆదాని, అంబానీలకు దోచిపెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజారిటీ మొత్తం తెలంగాణా ప్రజల సొమ్మేనని తెలిపారు. వ్యవసాయంతో పాటు వ్యాపార, వాణిజ్య గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు కళ్యాణాలక్ష్మీ, షాదిముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలతో ప్రజల నోళ్ళలో నిత్యం నానుతున్నారన్నారు. మోదీ ప్రధానిగా ఎన్నికయిన రోజున 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 1200కు పెరగడమే మోదీని ప్రజలు గుర్తుంచుకోవడానికి కారణమైందని విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అప్పుడూ ఇప్పుడూ 100 డాలర్లే నన్నాని తెలిపారు. అటువంటప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమెందని కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బీజేపీ పంచన చేరారని విమర్శించారు. ఇద్దరు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. గుజరాత్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి రాహుల్ గాంధీ ఎగనామం పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు భారత జోడో యాత్ర పేరుతో తెలంగాణాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మునుగోడు ఎన్నికల ప్రచారానికి రాక పోవడం వెనుక దాగి ఉన్న మర్మం కుడా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీకి ఉన్న సంబంధాలే కారణమన్నారు. యావత్ భారతదేశం బీఆర్ఎస్ వైపే చూస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దారిద్య్ర నిర్మూళన జరుగుతుందన్న విశ్వసనీయత దేశ ప్రజల్లో బలంగా పెరిగిందన్నారు. పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ రేగట్ట మల్లికార్జున్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.