Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యల కంటే మతచిచ్చు రేపడమే బీజేపీ లక్ష్యం
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ మున్సిపల్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలుకాకుండా ఆటంకాలు కల్పిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను సైతం ధ్వంసం చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల కంటే మత చిచ్చు రేపడమే బీజేపీ లక్ష్యమన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు ప్రజలు సిద్దం కావాలన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 17 నుండి చేపట్టే జనచైతన్యయాత్రలో ప్రసంగాలతోపాటు విస్తతంగా ప్రచారం చేస్తామన్నారు. 17న వరంగల్‌లో మొదటి యాత్రకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరై ప్రారంభిస్తారని, ఈ నెల 23న అదిలాబాద్‌లో రెండో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ప్రారంభిస్తారని, ఈ నెల 24న నిజామాబాద్‌లో మూడో యాత్రను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ ప్రారంభిస్తారని, 29న హైద్రాబాద్‌లో ముగింపు సభకు ప్రకాశ్ కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్రకమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, జిల్లాకమిటీ సభ్యురాలు అవ్వారి రామేశ్వరి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు బత్తుల దాసు, గోశిక స్వామి, ఉష్కాగుల శ్రీనివాస్, రమేశ్, కామిశెట్టి ప్రభాకర్, చీకూరి ఈదయ్య, బొడ్డు రాజు, మొగుదాల రాములు, గోశిక కరుణాకర్, దేప రాజు, చప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, నెల్లికంటి నర్సింహా పాల్గొన్నారు.