Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాకు 109 రాయితీ రుణాల మంజూరు
- ఉపాధి యూనిట్ల కోసం మైనార్టీ యువత ఎదురుచూపులు
- ఎంపిక చేయాలంటే జంకుతున్న అధికారులు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మైనార్టీ యువత స్వయం ఉపాధి కల్పన కోసం 109 యూనిట్లు మంజూరు చేసింది. గడిచిన ఏడు సంవత్సరాల అనంతరం రాయితీ రుణాలను మంజూరు చేయడంతో వాటి కోసం మైనార్టీ యువత ఎంతగానో ఆశతో ఎదురుచూస్తోంది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల మంజూరు కోసం అధికారులు దరఖాస్తుల ప్రక్రియను గత డిసెంబర్ 19న ప్రారంభించగా జనవరి 1న స్వీకరణ గడువు ముగిసింది. ఆయా దరఖాస్తులను సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలకు జిల్లా యంత్రాంగం పంపింది. లక్ష్యానికి అనుగుణంగా ఎంపిక చేసి పంపాలని సూచించింది. దాదాపు రెండు నెలలు కావస్తున్నా అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టకపోవడం గమనార్హం. దరఖాస్తులు మాత్రం స్వీకరించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయడం మాత్రం మరిచారు. అధికారులు గత నెల చివరి వారంలోనే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి జిల్లా కలెక్టర్ అనుమతితో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ వారికి ఎంపికైన అర్హుల జాబితాను పంపించవలసి ఉండగా ఆ ప్రక్రియను నేటికీ అధికారులు పూర్తి చేయలేకపోవడం గమనార్హం. దీంతో రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్న మైనార్టీ యువతకు ఎదురుచూపులే మిగిలాయి.
జిల్లాలో జనాభా.. యూనిట్లు.. దరఖాస్తులు
నల్లగొండ జిల్లాలో మైనార్టీ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 99,547 గా ఉంది. వీరి కోసం ప్రభుత్వం 109 రాయితీ రుణాల యూనిట్లను మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,864 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీ నుండి ఎనిమిది వందల నలభై దరఖాస్తులు రాగా అతి తక్కువగా నందికొండ మున్సిపాలిటీ నుండి ఒకే ఒక దరఖాస్తు వచ్చింది. ఈసారి మహిళలకు 33 శాతం వికలాంగులకు ఐదు శాతం రుణాలను కేటాయించారు.
రాయితీ...రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరం మైనార్టీ యువతకు స్వయం ఉపాధి పథకాల కోసం 109 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించారు. అంచనాకు మించి దరఖాస్తులు వచ్చాయి. 4864 దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల గుర్తింపు అధికారులకు పరీక్షగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 109 యూనిట్లలో 76 యూనిట్లు లక్ష రూపాయల వి కాగా, 33 యూనిట్లు రెండు లక్షల వి ఉన్నాయి. లక్ష రూపాయల రుణాలకు 80 వేల రూపాయల రాయితీ ఉండగా రెండు లక్షల రూపాయలకు లక్షా నలభై వేల రాయితీ ఉంది. మొత్తం 109 యూనిట్లకు 1.7 కోట్ల రూపాయలు రాయితీ రూపంలో అందుతుంది. రాయితీ పోను మిగతా మొత్తం బ్యాంకు రుణం లేదా లబ్ధిదారుల వాటా దనం కింద భరించేందుకు వెసులుబాటు కల్పించారు.
ఎంతో కాలానికి రుణాలు..
ప్రభుత్వం గడిచిన ఏడు సంవత్సరాల లో ఎప్పుడు రాయితీ రుణాలను జిల్లాకు మంజూరు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రమే రుణాలను మంజూరు చేసింది. 2015 -16లో అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 167 యూనిట్లను మంజూరు చేసింది. 2016 - 17 నుండి 2021- 22 వరకు మంజూరు చేయలేదు. 2022- 23 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయితీ రుణాలను మంజూరు చేసింది. అయితే 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో 50 వేల రుణాలను కేవలం 11 మంది కి మాత్రమే అందించారు. వారు కూడా 2015 - 16 లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అప్పట్లో ఎంపిక కాని వారికి రుణాలను అందించారు. మైనార్టీ నాయకులు మాత్రం 2014 ముందు అప్పటి ప్రభుత్వం రాయితీ రుణాలను ప్రతి ఏడాది మంజూరు చేసేదని పేర్కొంటున్నారు. ఇంతకాలం తర్వాత రుణాలను మంజూరు చేయడంతో ఎంతగానో ఎదురు చూడాల్సి వస్తుంది అంటున్నారు. ఎలాంటి రాజకీయ పైరవులకు తావు లేకుండా నిరుపేదలైన మైనార్టీ యువతకు రుణాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. అయితే యూనిట్లు తక్కువగా ఉండి దరఖాస్తులు ఎక్కువ రావడంతో పైరవీకారులు పెరిగారని లబ్ధిదారుల ఎంపిక ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు తలనొప్పిగా మారిందని ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టాలంటే జంకుతున్నారని పేర్కొంటున్నారు.
ఎంపీడీవోల అలసత్వం..
నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలలో ఎక్కువ శాతం మంది ఎంపీడీవోలు విధులను సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని కొంతమంది జిల్లా అధికారులే స్వయంగా పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత శాఖల మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ లు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి పనులపై దిశా నిర్దేశం చేసినా ఫలితం లేకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పనులను కూలీలకు పనులు కల్పించడంలో విఫలమయ్యారని, అందువల్లే జిల్లా స్థానం 19 నుండి 30 కి చేరిందని అంటున్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలకు పనులు కల్పించడంలో, గ్రామ పంచాయతీల పన్ను వసూలు పర్యవేక్షణలో, నర్సరీ మొక్కల పెంపకం, ఇప్పుడు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించిన రుణాల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇలా అన్నింటిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాయితీ రుణాల కోసం అందిన దరఖాస్తులను ఇప్పటికే మండలాలు, మున్సిపాలిటీలకు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు నెలన్నర క్రితమే పంపించారు. జనాభా ఆదారంగా లక్ష్యాలు కేటాయించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపాల్సి ఉంది. మండల స్థాయిలో ఆ బాధ్యత ఎంపీడీవోలు, మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ల పైనే ఉంది. ఇంకొంత కాలం ఆలస్యం అయితే సబ్సిడీ రుణాలు ప్రక్రియను ఆపివేసే అవకాశం కూడా ఉందని గతంలో కూడా జరిగిందని మైనార్టీ శాఖకు సంబంధించిన అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి మైనార్టీ రుణాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా జరిగేలా చూడటమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.
రెండు, మూడు సార్లు లెటర్లు పెట్టాం...
గోశిక బాలకృష్ణ (జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి)
రాయితీ రుణాలకు సంబంధించి ఎంపిక చేసిన అర్హుల జాబితా మండలాలు, మున్సిపాలిటీల నుండి నేటికి రాలేదు. త్వరగా పంపాలని చాలాసార్లు చెప్పాం. రోజు ఫోన్లో మాట్లాడుతున్నాం. రెండు, మూడు సార్లు లెటర్లు కూడా పంపించాము. ఇంతవరకు దరఖాస్తులు రాలేదు. చివరి ప్రయత్నంగా కలెక్టర్ ద్వారా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు లెటర్లు పంపిస్తాం.