Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
పర్యాటక రంగంలో యాదాద్రి జిల్లా ప్రముఖంగా ఉన్నదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ పర్యాటక రంగంపై జరిగిన వెబినార్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదివారం పాల్గొని మాట్లాడారు.జిల్లాలో పర్యాటక రంగంపై జిల్లా కలెక్టర్ వివరిస్తూ, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం కృష్ణ శిలలతో రూపుదిద్దుకున్న శిల్ప సంపదలతో జరిగిన పునర్నిర్మాణంతో జాతీయంగా అంతర్జాతీయంగా నిత్యం వేలాది మంది భక్తి భావంతో దర్శించుకుంటారని తెలిపారు. కొండ చుట్టూ పచ్చదనంతో, అందమైన పూల మొక్కలతో ఏర్పాటు చేయడం జరిగిందని, పార్కుల ఏర్పాటుతో పచ్చదనం పర్యాటకులను ఆకర్షిస్తుందని తెలిపారు. పోచంపల్లి పర్యాటక రంగంలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందని, ఇక్కడ తయారు కాబడే ఇక్కత్ చీరలు, డిజైన్లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయని, పోచంపల్లి గ్రామం వరల్డ్ టూరిజం విలేజ్ గా గుర్తింపు పొందిందని, హైదరాబాదుకు దగ్గరలో పోచంపల్లి ఉండడం వలన, మూసి పరివాహక ప్రాంతంలో పచ్చటి పొలాలతో నిత్యం చలనచిత్ర, సీరియల్స్ షఉటింగ్ లకు, పర్యాటకులను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. జలాల్ పూర్ లేక్ వ్యూ పార్కు ఏర్పాటు వలన హైదరాబాద్ నుండి పోచంపల్లి వెళ్లే వారికి మధ్యలో సేద తీరే పర్యాటక ప్రాంతంగా ఉందని, ఇక్కడికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు బ్లాక్ హెడ్ కొంగలు వలస వచ్చి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో నారాయణపూర్, రాయగిరి తదితర ప్రాంతాల లోని పురాతన మెట్ల బావులు సుందరీకరించడం వలన పర్యాటకుల రద్దీ పెరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని భువనగిరి ఖిల్లా విదేశీయులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నదని, ఇక్కడ శిక్షణ పొందిన పర్వతారోహకులు గిన్నిస్ బుక్ రికార్డులలో నమోదు కావడం జరిగిందని తెలిపారు. కొలనుపాక దేశంలోనే అతి పెద్ద ప్రాచీన జైన దేవాలయమని, వివిధ దేశాల జైనమతస్తులను ఆకర్షిస్తున్నదని తెలిపారు.