Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీకి రైతులు కార్మికులు వేలాదిగా తరలిరావాలి
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలపై ప్రతిఘటనే ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ అని రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చలో ఢిల్లీని జయప్రధాని కాంక్షిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో ఐక్య జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జూలకంటి హాజరై మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని యాటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాలు చేసిన మోడీ ప్రభుత్వం వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని, ఈ విధానాలను ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న మూడు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామన్నారు.
దేశ స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్ని రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చారని, దీనితో కార్మిక వర్గ హక్కులను కాలరాయపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల రెక్కల కష్టంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశంలో రైతు సంఘాలు గగ్గోలు పెడుతుంటే మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారని విమర్శించారు. ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మికుల పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల 3వేల 97 కోట్ల బడ్జెట్ లో సంక్షేమ రంగాన్ని విస్మరించి కార్పొరేట్లకు ఊడిగం చేసేదిగా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు. పీడీఎస్‌కు 90 వేల కోట్లు రైతుల ఎరువుల సబ్సిడీకి 50 వేల కోట్లు, ఉపాధి హామీకి సగానికి సగం బడ్జెట్ తగ్గించారనీ విద్య,వైద్య రంగాలకు కూడా నామ మాత్రం కేటాయింపులు చేశారని, ఇది ఏ రకమైన సంక్షేమమో మోడీ చెప్పాలని ప్రశ్నించారు. కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలపై మతోన్మాద రాజకీయాలపై ప్రజలు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి మాట్లాడుతూ చలో ఢిల్లీ ప్రచార క్యాంపెయిన్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవాలని అందుకోసం జనరల్ బాడీ లు సభలు సమావేశాలు జీపు జాతాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు సీఐటీయూ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు సిహెచ్.లక్ష్మీనారాయణ, వీ. వెంకటేశ్వర్లు, బొజ్జ చిన వెంకులు అధ్యక్షత వహించగా. మూడు సంఘాల జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కున్రెడ్డి నాగిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికారి మల్లేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సీఐటీయూ నాయకులు అవుత సైదులు, మల్లు గౌతమ్ రెడ్డి, ఏర్పుల యాదయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, మంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పీ. సైదులు గండమల్ల రాములు ఉడుగుండ్ల రాములు, చింతపల్లి లూర్దు మారయ్య, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.