Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హోలీ పండుగ
- రంగుల కొనుగోళ్లతో దుకాణాల వద్ద సందడి
- సహజ రంగులు వినియోగించాలని పర్యావరణ వేత్తల సూచన
- ముస్తాబైన ఆలయాలు
- పలుచోట్ల కామ దహనాలు
రంగుల పండుగకు వేళైంది.. చిన్నాపెద్ద, ఆడామగ తారతమ్యం లేకుండా రంగుల ప్రపంచంలో మునిగిపోనున్నది. హోలీ.. హోలీల రంగ హోలీ.. చెమ్మకేళిల హోలీ.. అని పాడుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. సోమవారం రాత్రి కామదహనాలను వాడవాడలా నిర్వహించారు.
నవతెలంగాణ-నల్లగొండ
హోలీరె రంగ హోలీ చమ్మకేళిరె హోలీ.. అంటూ రంగుల పండుగను ఆనందోత్సవాల మధ్య చిన్నా పెద్దా తేడాలేకుండా జరుపుకొంటారు. పల్లె, పట్టణం, గల్లీ, వాడాల్లో ఈ రంగుల పండుగను జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ పండుగ కేవలం రంగులకే కాకుండా దావత్‌లకు కూడా పెద్ద పండుగనే. స్నేహితులు, బంధువులంతా కలిసి ఆనందంగా గడుపుతారు. ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజు ఈ పండుగ వస్తుంది.
కామదహనం..
హోలీ పండుగ ముందు రోజు రాత్రి అన్ని గ్రామాల్లోని రహదారుల వద్ద పిడకలు, కట్టెలు పేర్చి కాముడిని దహనం చేస్తారు. ఆ మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకొంటారు. గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి మక్కలు, శనగలు, ఇతర ధాన్యాలు సేకరించి, కొత్త కుండలో వేసి ఉడకబెడుతారు. కామదహనం చుట్టూ వేస్తూ నీటిని పోస్తారు. మరుసటి రోజు కాముని బూడిదను ఇంటికి తీసుకెళ్తారు. ఇదో అనవాయితీ. హోలీ పండుగ రోజు వదినా మరదళ్లు, బావా బామ్మరుదులు, వరుసైన వారు రంగులు చల్లుకుంటారు.
జాజిరి.. జాజిరా....
కామదహనాన్ని పురస్కరించుకుని జాజిరి.. జాజిరా.. అంటూ హోలీ పాటలు పాడుతూ గ్రామాల్లో చిన్నారులు కోలలు ఆడుతూ వీధుల్లో తిరుగుతూ చందాలు తీసుకుంటారు. కామదహనం నాడు ఆ కోలలను ఒక్కచోట చేర్చి, మన్మథున్ని ప్రతిమను తయారు చేసి కామదహనం చేస్తారు. మరుసటి రోజు హోలీలె రంగ హోలీ అంటూ మహిళలు చప్పట్లు కొడుతూ ఇండ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు వెళ్లి చందాలు తీసుకుంటారు.
సహజ రంగులు ఆరోగ్యకరం...
సహజ సిద్ధమైన వాటికి బదులుగా కెమికల్స్‌తో కూడిన రంగులతో పండుగ జరుపుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమికల్స్ కలిసిన రంగుల వాడకంతో చర్మం ఎర్రబడడం, దద్దుర్లు రావడం, తిమ్మిర్లతో పాటు కండ్లలో పడితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తలు పాటించి హోలీ పండుగను జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మోదుగ, బంతి, కుసుమ పూల నుంచి పసుపు రంగు, గోరింటాకు నుంచి ఆకుపచ్చ రంగు, ఎర్రచందనం, జాప్రా మొక్కల నుంచి ఎరుపు రంగు, వాయిల్ ఆకుల నుంచి నలుపు రంగును తయారు చేసేవారు. వీటి ఆకులు, పూల రెక్కలు, విత్తనాలను వేడి నీటిలో బాగా ఉడక బెట్టడంతో తయారయ్యే రంగులు ఆరోగ్యానికి మంచివి. నిమ్మ, పసుపు, కుంకుమను వాడడంతో తయారయ్యే ఈ రంగులు వసంత రుతువు ప్రారంభంతో వాతావరణంలో కలిగే మార్పులను తట్టుకోగలిగే శక్తిని శరీరానికి అందిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
రసాయన రంగులతో జాగ్రత్త...
డాక్టర్ అనిత రాణి (చర్మవ్యాధి నిపుణులు)
హోలీకి వినియోగించే రసాయన రంగులతో చర్మవాధులు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రీసు, ఆయిల్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇలాంటి రంగులతో దురద, దద్దుర్లు ఇతరత్రా చర్మ వ్యాధులు వస్తాయి. రంగులు కళ్లల్లో పడితే నలవడం, రుద్దడం చేయకుడదు. చల్లని నీటితో శుభ్రం చేసి, అవసరమైతే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. ప్రకృతి సిద్ధంగా లభించే రంగులు వాడడంతోనే ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
సంతోషాల పండుగ. ..
బొంతల శంకర్ (మీసేవ నిర్వాకుడు, నల్లగొండ)
హోలీ అంటే సంతోషాలు తీసుకొచ్చే పండుగ. ప్రతి ఏడాది పండుగకు రెండు రోజుల ముందే మా దోస్తులతో కలిసి మోదుగ పూలు తీసుకొచ్చి ఎండ బెట్టి వాటిని నీటిలో నాన బెడితే వచ్చే రంగు చల్లుకుంటాం. లేదంటే మామూలుగా దొరికే సహజ సిద్ధమైన రంగులను వాడుకుంటాం. అందరం కలిసి ఒకరిపై ఒకరం రంగులు పోసుకుంటూ ఆనందంగా గడుపుతాం.