Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే పోరాటం తప్పదు
నవతెలంగాణ-నిడమనూరు
భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మోటార్ సైకిల్స్ ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త పోరాటం తప్పదని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నిడమనూరు మండల జనరల్ బాడీ సమావేశం స్థానిక మార్కెట్ యార్డులో పోలేపల్లి రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో వెల్ఫేర్ బోర్డు కార్డు ఉన్న కార్మికుల అందరికీ మోటార్ సైకిల్ ఇస్తామని మంత్రి టీ.హరీశ్‌రావు ప్రకటించారు. మే1న లక్ష మోటార్ సైకిల్ ఇస్తామని కార్మికశాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి కూడా ప్రకటించారు. 10 నెలలు గడిచిన నేటికి ఎలాంటి విధి విధానాలు రూపొందించలేదని, వెంటనే మోటార్ సైకిల్స్ ఇవ్వాలని కోరారు. కార్మికులందరినీ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ పథకాలు రెట్టింపు చేయాలన్నారు. తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో 3 వేల700 కోట్లు మూలుగుతున్న పెండింగ్ క్లెయిమ్స్‌ని క్లియర్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 54 వేల క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణాలు సహజ మరణాలు వివాహ ప్రసూతి కానుకలు ఇతర బెనిఫిట్స్‌కి ఇచ్చే నష్టపరిహారం పెంచాలని కోరారు. ఏ సమస్య పరిష్కరించాలని లేబర్ ఆఫీస్‌కి వెళ్ళిన ఖాళీ పోస్టులు ఉన్నాయని, పని భారం పెరిగిందని అధికారులు అంటున్నారని, అందుకే ఖాళీగా ఉన్న ఏఎల్ ఓ, ఏసీఎల్, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం కార్మికుల పేర్లు నమోదు చేయాలని, గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కోదండ చరణ్‌రాజ్, అధ్యక్షులుగా ఇంజమూరి శివకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా చింతపల్లి సైదులు, కోశాధికారిగా పోలేపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులుగా పోతుగంటి కోటయ్య, సాదు, నగేష్ , దాసరి సైదులు, సహాయ కార్యదర్శిలుగా ఎం.చంద్రశేఖర్, డీ. సోమయ్య, ఎం. నాగార్జున, కమిటీ సభ్యులుగా ఎం. సెంచులు, ఎస్కే. హజరత్, బీ.కృష్ణ, కే.సైదులు, డీ.లక్ష్మయ్య, డీ.లక్ష్మణచారి, డీ. ప్రసాద్, ఎన్.సురేందర్ , పుట్ట వెంకన్న ఎన్నికయ్యారు.