Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలోని ప్రాచీన రుక్మిణి సత్యభామ గోదాదేవి సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి నవ కలశ స్నపనం పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం జరిపి 9 కళాశాలలో పంచామృతాలు, పవిత్ర నదీ జలాలు సుగంధ ద్రవ్యాలు నింపి స్వామివారి ఉత్సవమూర్తులకు మూల మూర్తులకు అభిషేకము జరిపారు.వేద పండితులు నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య, దేవాలయ అర్చకులు ముడుంబా విష్ణువర్ధనాచార్య, గ్రామ పురోహితులు రాకేష్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అభిషేకం తరువాత స్వామివారికి దేవాలయ ధర్మకర్తలు యాదా నరసింహారావు - నిర్మల, మహేష్- కన్యాకుమారి దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. నేడు స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం జరగనున్నది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మెన్ అమరనాయిని వెంకటేశ్వరరావు, సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ అనిత, నందుల లక్ష్మీనరసింహ శాస్త్రి, యాదా హనుమంతరావు, గుండపనేని ప్రభాకర్‌రావు, అమరబోయిన శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు కన్నేబోయిన సింగరయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.