Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-తుంగతుర్తి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను మండలంలోని వీఎన్ భవన్లో ఆయన ప్రారంభించి మాట్లాడారు.దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యధికంగా ఉన్న కార్మికులకు రైతులకు మేలు చేయకుండా కొద్దిమంది కార్పొరేట్‌శక్తులకు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ వారికి కొమ్ముగాస్తున్నారని విమర్శించారు.అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతూ యువతకు ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.మతం పేరుతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఈ దేశంలో మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగుకోడ్‌లను తెచ్చి యూనియన్లను పెట్టుకునే అవకాశం లేకుండా, పని భద్రత లేకుండా కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్లాచట్టాలను తేవడంతో 13 నెలలు పోరాడి ఎందరో మంది చనిపోయినాక మేము పొరపాటు చేశామని వాటిని రద్దు చేస్తామని మోడీ చెప్పడం దారుణమన్నారు.ప్రశ్నించే గొంతుకను జైల్లో వేస్తున్నారన్నారు.దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాల పార్టీలను కాకుండా ఇతర ప్రభుత్వాలను ఈడీలు,సీబీఐ, ఇతర దాడుల పేర ఆ ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం మోడీ చేస్తున్నారని విమర్శించారు.బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి నిరుద్యోగ సమస్యను తొలగించి దేశంలో ఉన్న పేద ప్రజలకు మేలు కలిగే చట్టాలను రూపొందించి ప్రజా ఉపయోగకరమైన పనులు చేపట్టాలని కోరారు.అంతకుముందు అపార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకుడు ఓరుగంటి అంతయ్య ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్‌రెడ్డి,మండల కార్యదర్శులు కల్లేపల్లి భాస్కర్, ఉప్పలయ్య, శ్రీనివాసు, నాయకులు పల్లా సుదర్శన్, కడెం లింగయ్య, ముత్తయ్య, ఎల్లయ్య, సోమయ్య, యాదగిరి, లక్ష్మి పాల్గొన్నారు.