Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందే
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పోరాడి సాధించుకున్న కార్మిక, కర్షక హక్కుల రక్షణ కోసమే ఏప్రిల్ 5న చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని, గిట్టుబాటు ధరల చట్టంపై భారత రైతాంగాన్ని నమ్మించి మోసం చేసిన మోడీ ప్రభుత్వం గద్దె దింపడానికి కార్మికులు ,కర్షకులు ఐక్యంగా ఢిల్లీ కదలి రావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కార్మిక ,కర్షక జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు.75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి రాజ్యాంగం కల్పించిన సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా చేసిందన్నారు.కనీసవేతనాల జీవోలను సవరించకపోవడం వల్ల షెడ్యూల్, నాన్‌షెడ్యూల్ ప్రాంతాల్లో చట్ట ప్రకారం వేతనాలు అమలు కావడం లేదని విమర్శించారు.గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికులకు రోజుకు రూ.178గా మోడీ ప్రభుత్వం ప్రకటించన సుప్రీంకోర్టు డైరెక్షన్‌ను ఉల్లంఘించడమే నన్నారు.అసంఘటిత కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలివ్వాలని, వ్యవసాయ కార్మికులకు రోజు వేతనం రూ.600 లకు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంత పేదలకు విస్తారంగా పని చూపుతున్న గ్రామీణ ఉపాధిపనికి 30 శాతం నిధులను కోత విధించడం వెనక భవిష్యత్‌లో ఈ పనిని ఎత్తివేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.ఇప్పటికే ఐదు కేజీల సబ్సిడీ బియ్యాన్ని ఎత్తివేసిందన్నారు.మరోవైపు నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు..వంట గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుని జీవితం దుర్పరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతాంగ రుణమాఫీని చేయడానికి సిద్ధపడని మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు బడ్జెట్లో 25 కోట్ల రూపాయలను రాయితీలను ప్రకటించిందన్నారు. రైతులకు విత్తనాలు, మందులపైన ఇప్పుడే సబ్సిడీని ఎత్తివేసిందన్నారు. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50శాతం కలిపి పంటలకు గిట్టుబాటు ధరల నిర్ణయించే చట్టాన్ని తీసుకొస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నమ్మించి మోసం చేసిందన్నారు.తెెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు పల్లె వెంకట్‌రెడ్డి,సీఐటీయూ జిల్లా నాయకులు చెరుకు ఏకలక్ష్మి,సోమపంగ రాధాకృష్ణ, శీలం శ్రీను, రైతుసంఘం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మందడి రాంరెడ్డి, దేవరం వెంకటరెడ్డి, దేవిరెడ్డి స్టాలిన్ రెడ్డి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసుసత్యం, సిరికొండ శ్రీను,నారసాని వెంకటేశ్వర్లు, నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.