Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకసారి నాటితే 30ఏళ్లు దిగుబడి అ ఎకరాకు రూ.15లక్షల ఆదాయం - ఆధునిక పద్దతుల్లో ఎన్ఆర్ఐ సేద్యం అ యూనివర్శిటీ నుంచి వ్యవసాయ బడికి అ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ప్రస్థానం
నవతెలంగాణ-హుజూర్నగర్ రూరల్
భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయ రంగం ఎంత దన్నుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దేశానికి పట్టుగొమ్మ అయిన వ్యవసాయాన్ని ఇప్పుడు వస్తున్న ఆధునిక పద్ధతులను, ఆధునాతన పంటలను మేళవించి సేద్యం చేస్తూ ముందుకు వెళ్లకుంటే రైతు రాణించలేని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ పంటలనే నమ్ముకుని వెళితే ఈరోజుల్లో రైతు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఓ ఎన్ఆర్ఐ ఆధునిక వ్యవసాయ పద్దతులను అందిపుచ్చుకుని అధునాతన పంటలను సేద్యం చేసేందుకు నడుంకట్టారు. ఆయనే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ). సేంద్రియ పద్దతుల్లో ఇప్పటికే మామిడిని సాగుచేస్తున్న తాను డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నడుంబిగించారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు వివరాలను ఆయన 'నవతెలంగాణ'తో పంచుకున్నారు.
కరోనా అనంతరం పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంచి ఔషధ గుణాలు కలిగి ఉండటంతో చాలా మంది రైతులు దీనిని సాగుచ ేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాను. సుమారు రూ.65లక్షల వరకు ఖర్చు వస్తుంది. దీనిని రెండు రకాలకుగా సాగు చేసుకోవచ్చు. ఒకటి రింగ్ సిస్టమ్, రెండు ట్రెల్లీస్ మెథడ్. రింగ్ సిస్టమ్‌లో ఎకరాకు 5లక్షల ఖర్చు వస్తుంది. దీనిలో ఎకరానికి 2వేల మొక్కలు పడతాయి. ట్రెల్లీస్ సిస్టమ్‌లో ఎకరాకు 5,500 మొక్కలు పడతాయి. దీనికి 16లక్షల ఖర్చు వస్తుంది.
నైపుణ్యం గల కార్మికులతో పోల్స్ నిర్మాణం
డ్రాగన్ ఫ్రూట్ సేద్యానికి ముఖ్యంగా పోల్స్ ఎంతో అవసరం. వీటిని మధ్యప్రదేశ్ నుండి నైపుణ్యం గల కార్మికులను రప్పించి 10 అడుగుల పోల్స్‌ను స్వయంగా తయారు చేయిం చాను. పోల్‌కు పోల్‌కు మధ్య 10 అడుగుల దూరం బోదెకు బోదెకు మధ్య ట్రాక్టర్ తిరిగేందుకు వీలుగా 16 అడుగుల స్థలం వదిలేశాను. రెండు పోల్స్ మధ్య ఇరువైపులా 16మొక్కలు నాటుకోవచ్చు. ట్రెల్లీస్ సిస్టమ్‌లో రెండు వైపులా జింక్ కోటెడ్రాడ్స్, ఇరువైపులా 4ఎం.ఎం. వైరు రెండు వరుసల చొప్పున ఉండటంతో మొక్క దీనిపై వేలాడుతుంది. దీనిలో 10 నుండి 15 వరుసల్లో డబుల్ లేయర్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. 5.5 అడుగుల ఎత్తులో 16 నుండి 18 సెం.మీ. రాడ్డుతో సింగిల్ అండ్ డబుల్ లేయర్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాను.
డ్రాగన్ ఫ్రూట్ రకాలు
డ్రాగన్ ఫ్రూట్ సాగులో మొక్కల రకాల ఎంపిక కీలకం. అందుకు గాను దేశవిదేశాల నుండి మొక్కలను దిగుమతి చేసుకున్నాను. కేరళ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో 150 క్షేత్ర పర్యటనల ద్వారా అధ్యయనం చేసి మంచి దిగుబడులు వచ్చే మొక్కల రకాలను ఎంపిక చేసుకు న్నాను. తాను సేద్యం చేస్తున్న వాటిలో తైవాన్పింక్, సియాన్ ్రెడ్, మొరాకెల్ రెడ్, అమెరికన్ బ్యూటీ, ఆసిస్ వైట్, రాయల్రెడ్, ఇజ్రాయిల్ ఎల్లో రకాలు ఉన్నాయి. వీటిలో అరుదుగా లభించే వైట్, ఎల్లో రకాలు వియత్నాం, తైవాన్ నుండి దిగుమతి చేసుకున్నాము.
డ్రిప్ విధానంతో నీటి పొదుపు
డ్రాగన్ సాగుకు నీరు ఎక్కువగా అవసరం ఉండదు. తాను డ్రిప్ పద్దతుల్లో మొక్కలకు నీటి సౌకర్యం కల్పిస్తున్నాను. నాణ్యతలో రాజీ పడకుండా జైన్ కంపెనీకి చెందిన డ్రిప్ పరికరాలను వాడాను. బోదెకు ఇరువైపులా కలిపి అరఅడుగు దూరానికి ఒక డ్రిప్ కవర్ అయ్యే విధంగా అమర్చాము. ట్రైకోడెర్మా, సుడోమోనాస్, వ్యామ్, పాస్పరస్ సల్ఫర్ బ్యాక్టీరియా, జీవామృతం డ్రిప్ ద్వారా వారానికోసారి మొక్కలకు అందించాలి. వేసవిలో ఉష్ణోగ్రతల నుండి తట్టుకునేందుకు గాను స్పింకర్ల ద్వారా 7.7 అడుగుల ఎత్తు నుండి నీటిని ఎదజల్లుతూ ఉష్ణాన్ని అదుపులో ఉంచవచ్చు. ఆవుపేడ, ఆవుమూత్రము, పప్పు ధాన్యాల పిండి పదార్థాలు, బెల్లంతో జీవామృతం తయారు చేసే యంత్రాన్ని పూనే నుండి తెప్పించాను.
మొక్క నాటే విధానం
పూర్తి ఆర్గానిక్ విధానంతో సాగు చేస్తున్న దీనికి పోల్‌కు పోల్‌కు మధ్య అడుగు బోదె పోయాలి. బోదెల్లో వర్మీకంపోస్టు, పశువుల ఎరువు, గొర్రెలు, కోళ్ల పెంట కలపాలి. వీటితో పాటు ట్రైకోడెర్మా, సుడోమోనాస్, అజోస్పోరిల్లం, పాస్పరస్ సల్ఫర్ బ్యాక్టీరియా కలిపి బోదెల్లో కప్పివేసి మొక్కలు నాటాలి. అనంతరం మొక్కలపై సాఫ్ పిచికారీ చేయాలి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బోదెలను సరిచేస్తూ ఉండాలి. మొదటి మూడు నెలల వరకు ప్రతి 3 రోజులకు ఒక సారి మందులను స్ప్రే చేయాలి. మొక్క నాటిన 15 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటుంది. అనంతరం వేరుపోసుకుంటుంది. 8నెలల్లో కాపుకు వస్తుంది. పూత దశ నుండి కాయ తెంపే దశవరకు 45రోజుల సమయం పడుతుంది. సన్‌లైట్ వల్ల, ఓవర్ ఫీడింగ్ వల్ల ఎల్లో షేడ్ వస్తుంది. చీమల నివారణకు పాల్డాల్ పౌడర్ చల్లాలి. దోమల నివారణకు స్టికీ బ్యాగ్స్‌ను వాడాలి.
దిగుబడి.. మార్కెట్
ఎకరాకు కనీసం 10 టన్నుల దిగుబడి వస్తుంది. వీటిని స్థానిక వ్యాపారులతో పాటు హైదరాబాద్, ముంబాయి, పశ్చిమబెంగాల్ మార్కెట్‌కు ఎగుమతి చేయవచ్చు. కిలో ధర రూ.100పైగా ఉంటుంది.కాయలు కాసిన మొక్క భాగాన్ని తిరిగి నాటుకునేందుకు వీలుగా రైతులకు విక్రయించడం ద్వారా కూడా ఆదాయం అర్జించవచ్చు.
అంతర్ పంటలు
డ్రాగన్‌లో అంతర్ పంటల సాగు కూడా చేసుకోచ్చు. టమాటా, వేరుశనగ, పుచ్చ, దోస, ఆకుకూరలను సాగుచేసుకోవచ్చు. దీనిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు తీసువేస్తూ ఉండాలి. కొత్తగా ఈ పంటను సాగు చేయాలనే ఆసక్తి ఉన్న వారికి ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా తనను ఈ నెంబర్లో 9618300450 సంప్రదించవచ్చని డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) తెలిపారు.
డాక్టర్ శ్రీనివాసరావు(శ్రీశ్రీ) సేవా కార్యక్రమాలు...
ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ)గా సుపరిచితులు. 17సంవత్సరాలు సౌదీ అరేబియాలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇంగ్లీషు లాంగ్వేజ్ టీచింగ్‌లో అంతర్జాతీయ పత్రికల్లో ఒక విద్యాసంవత్సరంలో 42 పరిశోధనా వ్యాసాలు ప్రచురించి ప్రపంచ రికార్డును సృష్టించి 'ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్'లో చోటు సంపాదించుకున్నారు. సౌదీ అరేబియాలో తెలుగు కళాసమితి (టికేఎస్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉంటూ 17ఏండ్ల పాటు అక్కడి తెలుగువారికి సేవా కార్యక్రమాలు చేస్తూ, కష్టాలలో ఉన్నప్పుడు ఆర్థిక సాయం కూడా చేశారు. విద్యా ప్రాధాన్యత తెలిసిన వారు కనుక తన స్వగ్రామంలోని పాఠశాల విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. పాఠశాలకు తన స్వంత ఖర్చులతో గేటు ఏర్పాటు చేశారు. వంట గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేస్తూ విద్య ప్రాధాన్యతను వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నారు. మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణకు తనవంతు సహాయం అందజేశారు. వృత్తి పరంగానే కాకుండా తన ప్రవృత్తి అయిన వ్యవసాయం పట్ల తనకున్న మక్కువతో ఆధునిక వ్యవసాయాన్ని సేద్యం చేసేందుకు ముందడుగు వేశారు.