Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సమగ్ర వ్యవసాయంలో భాగంగా వరితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు పండించాలని, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలని కలెక్టర్ పమేలా సత్పతి రైతులను కోరారు.సోమవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం రైతువేదికలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థ డైరెక్టర్లు, రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలకు సహాయపడుతున్న స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, నాబార్డు అధికారులతో జరిగిన వాతావరణ మార్పు, అందుకనుగుణంగా పంట మార్పిడి, వ్యవసాయ విధానంలో మార్పులు తదితర అంశాలపై జరిగిన అవగాహనా సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.రైతులు సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఒక్కటే కాకుండా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాడి, కోళ్లపెంపకం, చేపల పెంపకం వంటి సమగ్ర వ్యవసాయ పద్దతుల మీద రైతులు దృష్టి పెట్టాలన్నారు.తమ పంట ఉత్పత్తులను, తద్వారా ఆదాయవనరులను పెంచుకోవాలని రైతులను కోరారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు కావలసిన తోడ్పాటును క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించాలని, తద్వారా ఉత్పత్తిదారుల సంస్థలు తమ మార్కెటింగ్ అవకాశాలను పెంచుకొని తమ ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకొని ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక డాట్ సెంటర్ శాస్త్రవేత్త మధుశేఖర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన కలిగే దుష్ప్రభావాలు, దాని వలన వ్యవసాయ రంగంలో కలిగే మార్పులకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు.అందుకనుగుణంగా తమ వ్యవసాయంలో చేసే పద్ధతులు, మార్పులు చేర్పులు చేయాలని, అధిక దిగుబడుల మీద దృష్టి పెట్టాలని సూచించారు.జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి నీలిమ పలు సూచనలు చేస్తూ రైతు ఉత్పత్తిదారులకు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుతాయని తెలిపారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారు వినరుకుమార్ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ అధికారి రామకృష్ణ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దేవ్‌సింగ్, వెంకటేశ్వర్లు, పద్మావతి, ఎపి మాస్ ప్రతినిథి గంగాధర్, స్థానిక పీస్ సంస్థ ప్రతినిధి నిమ్మయ్య పాల్గొన్నారు.