Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా దినోత్సవం పండుగలా జరుపుకునే రోజు కాదు. మహిళలు తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలను రూపొందించుకునే రోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జరుపుకుంటుంన్నారు. ప్రారంభంలో దీనిని అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవంగా వివిధ దేశాలలో వేర్వేరు తేదీల్లో నిర్వహించేవారు.1977లో ఐక్య రాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ మహిళ దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహిస్తున్నాయి. కానీ నేటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. వరకట్నపు చావులు, లైంగికదాడుల, వేధింపులు ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలకు ఎదరయ్యే వివక్ష, అసమానతలు మన సమాజంలో సర్వసాధరణమైన విషయాలుగా మారిపోయాయి.
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- దేశంలో మహిళలపట్ల నేటికీ కొనసాగుతున్న వివక్ష
నవతెలంగాణ నల్లగొండ
10 గంటల పని దినాలు, పురుషులతో సమానమైన వేతనాల కోసం అమెరికాలోని పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో మొదటి సారిగా 5వేల మంది మహిళలు ఆందోళనను నిర్వహించారు. ఈ ఆందోళన సమ్మె రూపంలో ఇతర ప్రాంతాలకు విస్తరించి చివరికి 1857 మార్చి 8న విజయవంతమై అక్కడి మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కడంతో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చరిత్రను అనుసరిస్తూ ఇదే రోజున సాధికారక సాధన కోసం మహిళలు అనేక పోరాటాలను నిర్వహించారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా అనే మహిళ ఫ్రెంచ్ విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. యుద్ధం వల్ల మహిళలపై రోజు రోజుకు పెరిగిపోతున్న హత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ పార్సి మహిళలు ఇదే రోజు వెర్సెల్స్‌లో ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలో 1909 ఫిబ్రవరి 28న అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1910లో కోపెన్హేగల్ సోషలిస్ట్ ఇంటర్నేషల్ వారు మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
2020 ఉమెన్స్ డే థీమ్ .... 'ఈచ్ ఫర్ ఈక్వాల్'
'ఈచ్ ఫర్ ఈక్వాల్' అనే థీమ్‌తో 2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమానత్వపు ప్రపంచమే శక్తి వంతమైన ప్రపంచం. అందుకే మహిళల సాధికారత కోసం విద్య, ఉద్యోగాలు, భద్రత, ఆరోగ్యం, ఆదాయం, నాయకత్వం, సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా మహిళలకు సమానత్వం కల్పించడం ద్వారా సమసమాజాన్ని నిర్మించాలి.
దేశంలో మహిళల అసమానతలు
భారత దేశంలో మహిళలు పురుషులతో పోలిస్తే రోజుకు 5గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నారు. ఆర్థిక సాధికారతలో మహిళల వెనుకబాటుకు ఇదే ప్రధాన కారణం. 2015లో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోనే స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను స్పష్టంగా వివరించినది. మొత్తం 145 దేశాలలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వంలో భారతదేశం 108వ స్థానంలో ఉన్నది. ఆర్థిక భాగస్వామ్యంలో 139వ స్థానంలో, విద్యలో 125 స్థానంలో, వైద్యం, ఆరోగ్యం 143 స్థానంలో ఉన్నది. భారతదేశంలో అసమానతలు కొనసాగడానికి ప్రధాన కారణం పురుషాధిక్య భావజాలం, మహిళ శక్తిని గుర్తించక పోవడం. రాజకీయ, ఆర్థిక రంగాలలో అసమానతలు అధికంగా ఉన్నవి. ప్రగతి బాటలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తగ్గుతూ ఉంటేనే స్థూల దేశీయోత్పత్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం కేసీఆర్ కీలకనిర్ణయాలు
జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు ,సూర్యాపేట
రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం సిఎం కేసిఆర్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాల జ్ఞాపకార్థం.లింగ సమానత్వం, మహిళల హక్కులు, మహిళలపై హింస వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.రాజకీయాలలో మహిళలు కూడా ఎదగాలి.రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించటంతో నేడు తనకు ఇతర మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రజా సేవ చేసే అవకాశం కలిగింది. మహిళా ఉద్యోగులందరికి మార్చి 8న ప్రత్యేక సెలవు దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాను జిల్లా ప్రజా పరిషత్ మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాబడినానంటే దానికి కారణం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆశీస్సులతోనే.మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
సమానత్వం మాటల్లోనే...ఆచరణలో కాదు: అలుగుబెల్లి సుధా గృహిణి ,నల్గొండ
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలైన మహిళలు నేటికి దోపిడీకి గురవుతూనే ఉన్నారు. గృహిణిగా శ్రమజీవిగా, ఉద్యోగిణిగా, ప్రజా ప్రతినిధిగా అన్ని రంగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళలకు తగిన గుర్తింపు, సమాన వేతనం దక్కటం లేదు. మహిళల సమానత్వం మాటలలోనే తప్పా ఆచరణలో కానరాదు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికి సమాన అవకాశాలను కల్పించింది. కానీ ఆదర్శానికి వాస్తవాలకు మధ్య అగాధం పెరుతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా మహిళలు వివిధ రంగాల్లో పట్టుదలతో విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
ప్రభుత్వ విప్, అలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆలేరుటౌన్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి సాధించిన స్వరాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ తగిన ప్రాధాన్యత ప్రభుత్వం కల్పిస్తుంది. అన్ని శాఖలలో మహిళా ఉద్యోగులకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభిస్తుంది. ప్రభుత్వ విప్‌గా , ఆలేరు శాసన సభ్యురాలిగా ప్రజలకు సేవ చేయడం సంతోషంగా ఉంది. ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం నా భర్త డీసీసీబీచైర్మెన్్ ,టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్‌్ గొంగిడి మహేందర్ రెడ్డి సహకారంతో ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావిస్తూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నాను. మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం భారతదేశనికే ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాను.
మహిళా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి
ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, సూర్యాపేట
మహిళల పట్ల జరుగుతున్న దాడులను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.మహిళలపై ,విద్యార్థులపై ,ఆడపిల్లలపై జరుగుతున్న లైంగికదాడులను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.సమాజంలో ఆడపిల్లల పట్ల తక్కువ చూపు చూడడం, ఆంక్షలు పెట్టడం సరికాదు.కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మహిళలకు రక్షణ ఉంటుంది.ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా ఎదిరించాలి. పౌష్టికాహార లోపం, మాతాశిశు మరణాల లాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలి.మహిళలకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.
మహిళల భద్రతపై మరింత ప్రతిష్టమైన చర్యలు అవసరం
ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ పరిజాతం, ఆలేరుటౌన్
మహిళల భద్రతపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయవలసి ఉంది. మహిళలు అని రంగాలలో నేడు ముందంజలో ఉన్నారు. తల్లిగా, బిడ్డగా , సమాజంలో సేవకురాలిగా, సేవలందిస్తున్నారు. స్త్రీలు ఇంటికే పరిమితం కాకుండా ఉండడానికి ప్రభుత్వాలు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సమాజం పట్ల, మహిళల తో ప్రవర్తన అనే అంశంపై అవగాహన కల్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.
స్త్రీ శక్తికి సాటేది...?
సునీత ఉపాధ్యాయురాలు నల్గొండ
మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. 'ఏ పక్షి అయినా ఒక్క రెక్కతో ఎగరలేదు' అన్న స్వామి వివేకానంద మాటలను స్మరిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు. 'సామాజంలో అన్ని మారుతున్నాయి... ఒక్క మహిళల పట్ల సమాజ ఆలోచనా ధోరణి తప్ప' అవును. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వము మన ప్రగతికి మూలం. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఉన్నత స్థితికి చేరుకొని స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటుతూనే ఉన్నారు.
స్త్రీ లేనిదే సృష్టే లేదు...ఎస్పీ కే.అపూర్వరావు,నల్లగొండ
స్త్రీ లేనిదే జననం లేదు . స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదే మనుగడ లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. జగతిలో స్త్రీకి ఉన్నత స్థానం కలదు.మహిళలు చట్టాల పైన, వారి హక్కుల పైన అవగాహన కలిగి ఉండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నవతెలంగాణతో మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వారి హక్కుల సాధన కోసం పోరాడాలి. మహిళా సాధికారత దిశగా సాగాలి. ముఖ్యంగా మహిళలు దిశ యాప్ పై అవగాహన కలిగి ఉండాలి. బాలికలు బాల్య వివాహాల పై జాగ్రత్తగా ఉండాలి. చదువు పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఈవిటీజింగ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి అలాంటి వారిపై పోలీసుల దృష్టికి తీసుకురావాలి. స్త్రీ ఒక మాతృమూర్తిగా, ఒక చెల్లిగా, ఒక అక్క గా మగవాడి జీవితం లో సగభాగంగా ఉండడం గమనార్హం.
అవరోధాలను అధిగమిస్తూముందుకు సాగాలి : పాలడుగు ప్రభావతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ
సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేకపోతే సృష్టేలేదు. అంతటి మహోన్నత శక్తి గలిగిన మహిళ నేటి నవ సమాజంలో సాటి సభ్యసమాజాన్ని చూసి కన్నీరు పెడుతోంది. ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే దుస్థితి దేశంలోనే ఉన్నది. బయటి ప్రపంచాన్ని చూడకుండానే చాలా మంది ఆడపిల్లలు అసువులుబాస్తున్నారు. ఆడపిల్లను కనడం, చదివించటం, పెండ్లి చేయటం, భారంగా భావించే తల్లిదండ్రులు దేశంలో చాలా మంది ఉన్నారు. అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే పెద్ద శిక్షగా భావించటం వల్ల ఆడపిల్లల సంఖ్య రోజుకు రోజుకు క్షిణిస్తుంది. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయం, క్రీడలు, అంతరిక్షం, టెక్నాలజీ రంగం ఏదైనా మహిళలు పురుషులకు సమానంగా ప్రతిభను చాటుకుంటున్నారు. మహిళలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలి.
మహిళల సాధికారత నేటికీ నెరవేరలేదు : తుమ్మల పద్మ ,ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు, నల్లగొండ
మహాత్మాగాంధీ ఆడది అర్ధరాత్రి నడిరోడ్డుపై నడిచి వెళ్లినపుడే నిజమైన స్వాంతత్య్రం అన్నారు. కానీ నేడు పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలకు తగిన సౌకర్యాలు భద్రత కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా మహిళలపై వేధింపులు, హింస, లైంగికదాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల పౌష్టికాహార లోపంతో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, శ్రామిక మహిళలకు బీమా సౌకర్యం, అంగన్వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, పారిశుధ్య వర్కర్లను ప్రభుత్వం గుర్తించి కనీస వేతనాన్ని అందించనప్పుడే మహిళలకు నిజమైన సాధికారిత, మహిళా దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.
అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు మరింత ముందుకు రావాలి : మామిడి ప్రమీల పీపీ, నల్గొండ
ఎడ్యుకేషన్ పరంగా ఆడపిల్లలకి అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అత్యున్నతమైన స్థానాల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఆడపిల్ల పుడితే కుటుంబమంతా పండగ చేసుకునే రోజుల్లో మనం ఉన్నప్పటికీ మహిళలపై అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా చట్టాలను కఠినతరం చేసి మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి విషయంలో కూడా స్త్రీ, పురుషులిద్దరూ సమానమైన ప్రాధాన్యత ఉన్నప్పటికీ మహిళలు మరింత ముందుకు వచ్చి అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలి.
మహిళలకు రక్షణ కల్పించాలి
వంగపల్లి పద్మ... వసతిగృహం సంక్షేమ అధికారి,కోదాడరూరల్
మహిళలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి.వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. బాలికలపై వేధింపులు మహిళలతో దౌర్జన్యాలు న్యూస్‌లో వస్తే మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. అలా తెలియకుండా జరిగేవి అనేకం వున్నాయి.మహిళలకు బాలికలకు ఆయా ప్రభుత్వాలు కచ్చితంగా నూతన చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పించి వారి అభ్యున్నతకు కృషి చేయాలి. వసతి గృహాలలో బాలికల రక్షణ కోసం కరాటే,కుంగ్‌ఫూ లాంటివి నేర్పించాలి.దీనివల్ల వారి ఆరోగ్యానికి కాకుండా వారి స్వీయరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసే మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి
ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, భువనగిరిరూరల్
మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి.ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు.అయినప్పటికీీ మహిళలు మరింత ముందుకు వచ్చి అన్ని రంగాల్లో అభివద్ధి చెందాలి ప్రభుత్వాలు కూడా మహిళలను ఆర్థిక బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. నేను రాజకీయరంగంలో రాణించడానికి నా భర్త ప్రోత్సహించారు. మహిళలను ప్రోత్సహించి వారి ఎదుగుదలకు పాటుపడాలి.
మనుషులమని గుర్తించండి
ప్రతీ ఏటా మార్చి ఎనిమిదిన మహిళ దినోత్సవం అంటా... సాధికారతకు ప్రతీకనో సమానత్వానికి నిదర్శనమో తెలుసుకొనేందుకే ఈ ప్రయత్నం అంటా...
ఒక వైపు
అనగారుతున్న విలువలంట..
మరోవైపు
మహిళాభ్యుదయానికి ప్రయత్నాలంట..
మహిళలపై ఆఘాహిత్యాలు
ప్రేమ పేరుతో అన్యాయాలు
మత్తు పదార్థాల వినియోగాలు
హేయమైన ప్రవర్తనలే
హీరోయిజానికి ప్రతీకలంట..
తల్లిని, చెల్లిని, కన్న బిడ్డని
మచ్చుకైనా
గుర్తు తెచ్చుకోని వైనమంట...
చదివేందుకు వణుకు పుట్టే వార్తలంట...
సమాజంలో స్త్రీకి
అణువణువునా అవమానమంట...
అన్ని రంగాలలో
స్త్రీ పురుషునితో సమానంగా
దూసుకుపోతున్న తరుణమంట...
ద్రౌపది ముర్ము, నిర్మల సీతారామన్
ఇలా ఎందరో మహిళామణులు
దేశాన్ని ముందుకు
నడిపిస్తున్న కాలమంట...
కాని,నిర్భయ గాయాలు మాసిపోక ముందే
ప్రీతి మరణం
ప్రతిరోజు ఏదో ఒక మూల
స్త్రీని అణగారుస్తూ,
అవమానిస్తున్న సమయమంటా...
కనుక వద్దే వద్దు..
మహిళా దినోత్సవం
వద్దే వద్దు
మాకసలే వద్దు
ఏరి? మహిళలను గౌరవించే మనుషులు,
ఏరి? మహిళల్ని సంరక్షించే సమాజం
ఏది ? ఎక్కడీ
యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే
తత్ర దేవతా
అనే ఊరడింపు మాటలు మాకెందుకు
వద్దే వద్దు..
సన్మానాలు, సత్కారాలు, శాలువాలు మాకసలే వద్దు...
స్వాతంత్రదినోత్సవం
గణతంత్ర దినోత్సవంకు
కానరాని లింగ భేదం
మరి మహిళా దినోత్సవానికే ఎందుకో...
ఇంతకీ పురుష దినోత్సవం ఎన్నడో?...
సంవత్సరం పొడవునా
అన్యాయాలు, అఘాయిత్యాలు
అంతులేని అవమానాలంట...
''మహిళదినోత్సవం'' అంటూ
ఒక్కరోజులోనేపాపప్రక్షాళనలు అసలెందుకుయిది..
ఏమైనా సాదించామనా?
సాదించాలనా? సాదిస్తున్నామనా?
అయినా మహిళలమని
గుర్తించడమెందుకు
మనుషులమని గుర్తించండి....
ఇదే జరిగిన నాడు
రోజు సమానత్వ దినోత్సవమే
ఎస్.చందన, ఎంఏ., ఎల్ ఎల్ ఎం.,
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కం అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, రామన్నపేట
మహిళలు రాజకీయాల్లోకి రావాలి.
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, సూర్యాపేట
మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో ఉన్న అసమాన తలు తొలగి పోతాయి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.మహిళలకు ఆహార భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. వంటగ్యాస్ ధరలను పెంచటం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మహిళలు, చిన్నారుల, ఆడపిల్లల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.మహిళల రక్షణకు షీ టీం, ఫోకస్, గృహ హింస వ్యతిరేక, వరకట్న వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది.రాష్ట్రంలో మహిళల రక్షణకు మహిళా కమిషన్ నిరంతరం పనిచేస్తుంది. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుంది.
సమాన అవకాశాలను
సద్వినియోగం చేసుకోవాలి
సల్మా భాను - జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి,నల్లగొండ కలెక్టరేట్
ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురుకోవలి. చిన్న విషయాలకే మనస్థాపం చెందకుండా సవాళ్ళను ఎదురుకుంటు ముందుకు సాగాలి.రాజ్యాంగం లో ఉన్న సమాన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని అవకాశాలను వినియోగించు కోవాలి. రాజ్యాంగం ప్రకారం మన దేశంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. దేశ రాష్ట్రపతి మహిళ గా ఉన్న నేల మనది. ఈ నేల ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడి నలుగురికి సహాయం చేయాలి. మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు.
గతంతో పోలిస్తే మెరుగైన మార్పు
సుభద్ర - జిల్లా మహిళ, శిశు, వికలాంగుల, సంక్షేమ శాఖ అధికారిణి,నల్లగొండ కలెక్టరేట్
గత పరిస్థితులతో పోలిస్తే మహిళల్లో నేడు మెరుగైన మార్పు వచ్చింది. ఇంకా మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరి కాళ్ళపై వారు నిలబడేందుకు కృషి చేయాలి.. ఆ దిశగా ముందుకు సాగాలి. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతుంది. వాటిని సద్విని యోగం చేసుకోవాలి.కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు రావాలి. అప్పుడే కుటుంబం అభివృద్ధి దిశలో ఉంటుంది. దీంతో జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లగలుగుతుంది.