Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలే కనిపించని రంగంలో రాణిస్తూ గుర్తింపు
నవతెలంగాణ-మోత్కూర్
ఆకాశంలో సగం...అవకాశాల్లోనూ సగం.. ఇది నేటితరం మహిళల నినాదం. వృత్తి ఎలాంటిదైనా, పని కష్టతరమైనదైనా, కేవలం మగవారికి సంబంధించిన వ్యవహారమైనా సరే అతివలు అందింపుచ్చుకుంటున్నారు. ఆయా వృత్తుల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవకు చెందుతుంది మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన సూరోజు జ్యోతి. ఆమె ఎలక్ట్రికల్ పనిలో కూలర్స్ , ఫ్యాన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్స్ , వాటర్ హీటర్స్ , ఐరన్ బాక్సులు, ఆఫ్ హెచ్ పీ, వన్ హెచ్ పీ మోటార్లు, ఎలక్ట్రికల్ గృహౌపకరాల మరమ్మతులను ఇలా రిపేరు చేస్తూ కష్టమర్లతో ఎలక్ట్రికల్స్ వర్క్ లో ఆల్ రౌండర్ గా మన్ననలు పొందుతోంది. ఆమె తన పని ద్వారా మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల కస్టమర్లకు సుపరిచితురాలు అయ్యింది. భర్త కృష్ణమాచారి మోత్కూరు పీఏసీఎస్ లో సీఈవోగా పని చేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. 1986లో వారి వివాహం జరగగా, పెళ్లైన కొత్తలో భర్త ఉద్యోగంతో పాటు తాను నేర్చుకున్న పనిని వదలలేక ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి వద్దే ఎలక్ట్రికల్ రివైడింగ్ వర్క్స్ దుకాణం నిర్వహించేవారు. గిరాకీ చాలా వస్తుండటంతో డ్యూటీకి వెళ్లి వచ్చిన కృష్ణమాచారి సాయంత్రం ఆ వస్తువులు రిపేరు చేసి ఇచ్చేవాడు. జ్యోతి డిగ్రీ వరకు చదువుకుంది. వారికి పెద్ద కుమారుడు రంజిత్ , చిన్న కుమారుడు రోహిత్ ఉన్నారు. భర్త ఎలక్ట్రికల్ వస్తువులు రిపేరు చేస్తుంటే చేదోడువాదోడుగా ఉండేది. భర్త డ్యూటీకి వెళ్లిపోయాక వచ్చిన గిరాకీ మళ్లి పోతుండటం చూసి ఉదయం, సాయంత్రం వేళ భర్త చేస్తున్న పనిని చూసి పట్టుదలతో నేర్చుకుంది. ఓ వైపు పిల్లలను చూసుకోవడం, స్కూల్ కి పంపడం, ఇంటి పనులు చేస్తూనే రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో పని నేర్చుకుని వస్తువులు మరమ్మతు చేయడం ప్రారంభించింది. భర్తకు వచ్చే కొద్దిపాటి జీతం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో తానూ పని చేస్తే చన్నీళ్లకు వేడినీళ్లలా కొంత ఆసరా అవుతుందని భావించి జ్యోతి షాపును పూర్తిస్థాయిలో నిర్వహించడం ప్రారంభించింది. షాపును విస్తరించడం కోసం తొలినాళ్లలో బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది. వచ్చిన కస్టమర్లను ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ సేపు వెయిట్ చేయించకుండా వెంటనే మరమ్మతు చేయించి ఇస్తుండటంతో కష్టమర్లలో మంచి పేరు ఏర్పడింది. రానురాను భార్య జ్యోతి పూర్తిస్థాయిలో షాపు నిర్వహిస్తుండటంతో భర్త కృష్ణమాచారి కూడా తన ఉద్యోగ విధులకే పరిమితమయ్యారు. 28 ఏళ్లుగా అదే వృత్తి లో రాణిస్తూ నేడు పట్టణంలో హరి ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంది. మహిళలే పెద్దగా కనిపించని వృతిలో రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం పెద్ద కుమారుడు రోహిత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకుమారుడు చదువుకుంటున్నాడు. భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే గృహిణులుగా ఇంటికే పరిమితమైన మహిళలు ఉన్న ఈ రోజుల్లో కుటుంబానికి అండగా ఉంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిని పలువురు ప్రశంసిస్తున్నారు.