Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుకను అక్రమంగా తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము సామాన్యుని నడ్డి విరుస్తూ నెలకు లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో సంబంధిత అధికారులు కనుసైగలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇసుక రవాణాపై ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ విధానానికి తూట్లు పొడుస్తున్నారు.
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలంలో కొలనుపాక ,గుండ్ల గూడెం, గొలనుకొండ పలు గ్రామాల్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుక మాఫియా ఇసుక రిచ్లో కాకుండా రైతుల వ్యవసాయ భూముల్లో కూడా ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇదేంటని అడిగిన రైతులను అనేక రకాలుగా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గ్రామాల నుండి ఎవరైనా 100కు డయల్ చేస్తే అధికారులు కూడా స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వారానికి కొన్ని గ్రామాల్లో రెండుసార్లు ఇసుక పర్మిషన్ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు కానీ గొలనుకొండ, గుండ్ల గూడెం, కొలనుపాక గ్రామాలలో రోజు 20 నుండి 25 ట్రాక్టర్లు, మరో గ్రామంలో 30 నుండి 60 ట్రాక్టర్లు ఇసుకను నిత్యం తరలిస్తున్నాయి. ఒక్కొక్క ట్రాక్టర్ ప్రతిరోజు 10 నుంచి 12 ట్రిప్పుల ఇసుకను తరలిస్తోంది. కొలనుపాక గ్రామంలో ఓ ప్రయివేటు వెంచర్లో సుమారు 20 ట్రాక్టర్ల ఇసుక పోసి డంపింగ్ చేశారు. గొలనుకొండ గ్రామాలో వ్యవసాయ బావి దగ్గర ఉదయం మధ్యాహ్నం వేళలో డంపింగ్ చేసుకొని చుట్టుపక్కల గ్రామాలకు రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ సంపాదిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఏ ఒక్క ట్రాక్టర్ ట్రాలీ మీద నెంబర్ ప్లేట్ లేకపోవడం, రవాణా శాఖ జారీ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండకపోవడం గమనార్హం. అధికారులు ఒకవేళ ఈ రహదారి వెంబడి వస్తే ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ ,వాట్సాప్ గ్రూప్ లలో సమాచారాన్ని చేరవేస్తున్నారు. పది రోజుల కిందట కొలనుపాకలో ఒక ట్రాక్టర్కు నాలుగు ట్రిప్పులకు పర్మిషన్ ఇస్తే పది ట్రిప్పులు కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా రైతుల భూములకు ఆనుకొని ఉండే ఇసుకదిప్పల నుండి అక్రమంగా తరలిస్తున్న తరుణంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల సమస్య పరిష్కారం జరుగుతలేదని జర్నలిస్టులు తహసీల్దార్ రామకృష్ణని వివరణ అడగగా వారానికి రెండుసార్లు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. రైతులు నిరసన వ్యక్తం చేయడంతో నెలరోజుల పాటు కొలనుపాక గ్రామానికి పరిమిషన్ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. సమాచారం చెప్పి రెండు రోజులు కాక ముందే నిత్యం ట్రాక్టర్లు అడ్డగోలుగా ఇసుకను డంపింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పర్మిషన్ ఇవ్వాలంటే రూ.5000 అధికారులు తీసుకుంటున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
మాసాపేట సుభాష్ కొలనుపాక రైతు
వారానికి రెండు రోజులు 30 నుండి 40 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నారు. ఇసుక అత్యధికంగా తీసుకెళ్లడంతో భూగర్భ జలాలు దెబ్బతిని బోర్లు ఎత్తివేస్తున్నాయి. గ్రామంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ తీసుకొచ్చి రెండు లేదా మూడు ట్రిప్పులు ఇసుక తీసుకెళ్లాలి కానీ ఇక్కడ అడ్డగోలుగా ఇసుక రవాణా జరుగుతుంది.
బయటికి గ్రామాలకు ఇసుక వెళుతుంది
కుమ్మరిండ్ల బాల నర్సయ్య కొలనుపాక రైతు
గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి మాత్రమే ఇసుక తీసుకెళ్లాలి కానీ అధికారుల అండదండలతో అక్రమ ఇసుక బయట గ్రామాలకు ఎక్కువ మొత్తంలో వెళుతుంది. ఊర్లో ఇసుక పోసుకుంటే డబ్బులు తక్కువగా వస్తాయి బయట ఇసుక తీసుకెళ్లినట్లయితే అధికంగా డబ్బులు వస్తాయని బయటికి తీసుకెళ్తున్నారు.
పర్మిషన్ లేకుంటే సీజ్ చేస్తాం
తహసీల్దార్ రామకృష్ణ
గ్రామాలకు వారానికి రెండు రోజులు మాత్రమే పరిమిషన్ ఇస్తున్నాను. అవి కూడా ఇండ్ల నిర్మాణానికి మాత్రం ఇసుక బయటకు వెళుతుందంటే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు బయటకు ఇసుక వెళుతుందని నా దృష్టికి రాలేదు. వారానికి రెండుసార్లు మాత్రమే 20 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నా.