Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరి
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఈనెల 15 తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లలో భాగంగా ఛీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, స్క్వాడ్స్క్కు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక తరగతి విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈనెల 15 నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాల ద్వారా 13,309 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 11 ప్రశ్న పత్రాల స్టోరేజీ పాయింట్స్ వుంటాయని, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, ఒకటి జిల్లా ఎగ్జిమినేషన్ కమిటీ టీమ్, రెండు కస్టోడియన్ టీములు, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ పరీక్ష నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో మంచినీటి, టాయ్లెట్స్, ఫాన్స్ వసతి కల్పించాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని, సెల్ఫ్ సెంటర్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తమ వెంట తెస్తే అనుమతించకుండా వాటిని ఒక ప్రత్యేక గదిలో భద్రపరచాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాసే విద్యార్ధినీ విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. అవగాహనా కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి పాల్గొన్నారు.