Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ-సూర్యాపేట
బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజ్యాంగము,రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం మార్చి 14న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి దళితులు అధిక సంఖ్యలో తరలిరావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ దళితులు, మహిళలు, మైనార్టీలపై దాడులు చేస్తుందన్నారు.బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను పరిశీలిస్తే రోజురోజుకు దళితులు మహిళలపై దాడులు పెరుగుతున్నాయే తప్ప వారికి రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.దళితులపై దాడులు జరిగితే అండగా ఉండి కాపాడాల్సిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఒక పథకం ప్రకారం దళితులపై దాడులు,హత్యలు చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం క్రమంగా భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయడం కోసం ఆర్ఎస్ఎస్,బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.కేంద్రప్రభుత్వ హాయంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేస్తుందన్నారు.ఈ విధానాల ఫలితంగా రిజర్వేషన్ల ఉనికికి దెబ్బ తగిలి సామాజికన్యాయం సమాధి అవుతుందని పేర్కొన్నారు.ప్రయివేట్రంగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచి పల్లెలు, పట్టణాల్లో రోజుకు 600 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను నిరసనగా జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, జిల్లా ఉపాధ్యక్షులు టేకుల సుధాకర్,జిల్లా సహాయకార్యదర్శి దేవరకొండ యాదగిరి, జిల్లా కమిటీ సభ్యురాలు గంధమల్ల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.