Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీయూ ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
పరిశోధనలకు విశ్వ విద్యాలయాలు కేంద్ర బిందువుగా మారి, సమాజానికి ఉపయుక్తమైన పరిశోధనలు విశ్వవిద్యాలయాల నుండి రావలసిన అవసరం ఉందని ఎంజీ.యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్లగొండ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఐసీఎస్ ఎస్ఆర్, దక్షిణ ప్రాంతీయ కేంద్రం ఎస్ఆర్సీ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాల పరిశోధకులు, యువ అధ్యాపకులకు పరిశోధన పద్ధతులపై నిర్వహిస్తున్న మూడు రోజుల వర్క్ షాప్‌ను ఆచార్య గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన మారుతున్న సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని వాటిపై క్షున్నమైన అధ్యాయనాలు జరగడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందన్నారు. పరిశోధనల్లో నైతిక ప్రమాణాలు తప్పకుండా పాటించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. సామాజిక శాస్త్రాల్లో మెరుగైన పరిశోధనలు నేటి సమాజానికి ఎంతైనా అవసరం ఉందన్నారు.
పరిశోధనలకు సహకారం ఉంటుంది
ఐసీఎస్ఎస్ఆర్ హానరరీ డైరెక్టర్ ఆచార్య బీ.సుధాకర్‌రెడ్డి
ఐసీఎస్ఎస్ఆర్ సంస్థ ద్వారా పరిశోధకులకు సహకారం ఉంటుందని ఐసీఎస్ఎస్ఆర్ హానరరీ డైరెక్టర్ ఆచార్య బీ.సుధాకర్‌రెడ్డి తెలిపారు. నూతన పరిశోధనలకు, ప్రాజెక్టులకు, పుస్తక ప్రచురణలు, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు సమర్పించేందుకు గ్రాంట్లు, కొంగొత్త ఆలోచనలతో తమను సంప్రదించిన వారికి తప్పకుండా ప్రోత్సాహం లభిస్తుందన్నారు. నేడు మన దక్షిణ ప్రాంతంలో ప్రతి విశ్వవిద్యాలయానికి సహకారం అందించినట్లు , ఇక ముందు కూడా మరింత సహకారం అందించేందుకు సదా ముందు వరసలో ఉంటామని చెప్పారు. నేటి కార్యశాలలో సామాజిక శాస్త్రాల పరిశోధన పద్ధతులు, ప్రాథమిక లక్షణాలపై ఆచార్య జాకబ్ కల్లె ఉపన్యసించారు. ఆచార్య బీ.సుధాకర్‌రెడ్డి ఎస్పీఎస్ఎస్ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు. ఈ నూతన సాప్ట్వేర్ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వివరించారు. ఆచార్య డీ.చెన్నప్ప పరిశోధన అంశాల ఎంపిక, పరిశోధన నమూనాల రకాలు పరిశోధన సాగించుటలో తగు జాగ్రత్తలపై వివరించారు. డాక్టర్ అనురాధరెడ్డి పాలమూరు విశ్వవిద్యాలయం మహబూబ్‌నగర్ సమాచార సేకరణపై పరిశోధకులకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ ముఖ్య పరిశోధకురాలుగా, డాక్టర్ ఆకుల రవి సహా పరిశోధకులుగా వ్యవహరించారు. ఐసీఎస్ఎస్ఆర్ సమర్పణలు జరిగిన పరిశోధన గ్రంధాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ మూడు రోజుల కార్యశాలకు కన్వీనర్‌గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకుల రవి, కో కన్వీనర్‌గా డాక్టర్ అంజిరెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిరియాల రమేష్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.