Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-నాంపల్లి
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలపై ప్రతిఘటనే ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ అని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాంపల్లి మండల కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఐక్య మండల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని, యాటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాల అమలును మరిచారన్నారు. మోడీ వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని, ఈ విధానాలను ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న మూడు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని దేశంలో రైతు సంఘాలు గగ్గోలు పెడుతుంటే మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారని విమర్శించారు. కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలపై, మతోన్మాద రాజకీయాలపై ప్రజలు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ ప్రచార క్యాంపెయిన్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవాలని, అందుకోసం జనరల్ బాడీలు, సభలు, సమావేశాలు, జీపు జాతాలు నిర్వహించాలని కోరారు. ఈ సదస్సులో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాషిపాక ముత్తిలింగం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొమ్ము లక్ష్మయ్య, కొమ్మ వెంకటయ్య, ముఖేష్, యాదయ్య, మరియమ్మ, ఈరమ్మ, సులోచన, రాములమ్మ, ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.