Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాని, అంబాని, మోడీ మిత్రులు
- ఔషధాలపై జీఎస్టీని రద్దు చేయాలి
- టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జూలకంటి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు ఏజెంటుగా పనిచేస్తూ ప్రజలకు ద్రోహిగా నిలిచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రేసెంటేటివ్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు శనివారం జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యంనగర్లో మనోరమ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు జూలకంటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు మల్లు స్వరాజ్యం నగర్లో టీఎంఎస్ఆర్యూ, ఎఫ్ఎంఆర్ఐ జెండాలను ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి యూనియన్ నాయకులతో కలిసి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఆదాని అంబానీలు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మంచి మిత్రులన్నారు. ఆధాని కుంభ కోణంపై సమగ్ర విచారణ జరిపి బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలు తిరిగి కట్టించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు దాసోహమై దేశ సంపదను దోచి పెడుతున్నారని తెలిపారు. అదే కోవకు చెందిన ఆదాని భారతదేశంలోని అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2002లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదానీ మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయని, ఆ సంబంధాలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను దాసోహం చేస్తూ కోట్ల సంపదను నరేంద్ర మోడీ ఆదానికి దోచి పెడుతున్నారని విమర్శించారు. నిరంతరం దేశభక్తితో మాట్లాడుతున్న మోదీ ఈ దేశ ప్రజలపై పెనుబారాలు మోపుతూ దేశ సంపదను కొంతమందికి దోచిపెట్టడం, దేశభక్తా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి, రైతు రంగానికి నిధుల ఊసే లేదన్నారు. కానీ పెట్టుబడిదారీ కార్పొరేటర్లకు లక్షల కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో నల్లగొండ జిల్లా ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో కౌన్సిల్ సమావేశాలు జరపడం సంతోషంగా ఉందన్నారు. తొమ్మిది సంవత్సరాలకాలంలో మోడీ ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి ఉపయోగపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మత సామరస్యాలను విఘాతం కలిగించేందుకు కుట్రలు చేసిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఈడీ, సీబీఐలు భజనలు చేస్తున్నాయని విమర్శించారు. దేశ లౌకిక విధానాలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తూట్లు పొడుస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన కులాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ మార్చే కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. రాజకీయ విలువలను బీజేపీ దిగజారుస్తుందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భాను కిరణ్, కార్యదర్శి రాజు బట్ మాట్లాడుతూ ఔషధాలపై జీరో జీఎస్టీని చేయాలన్నారు. మందుల ధరలను తగ్గించి, ఆన్లైన్ మందుల అమ్మకాలను ప్రభుత్వం నింపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ఫార్మా వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రే సెంటేటివ్స్కు కనీస వేతనం రూ.26,000 నిర్ణయించాలన్నారు. నల్లగొండ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ ఆర్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ సునీల్, దేబా శిష్ రామ్, జిల్లా అధ్యక్షులు నిరంజన్, కోశాధికారి పీ.రమేష్, కార్యవర్గ సభ్యులు సుధాకర్, స్వామి, సాయిరాం, నరేష్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం, దొడ్డు కొమరయ్య భవనం నుండి గడియారం వరకు వివిధ డిమాండ్లతో బారి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 500 మంది యూనియన్ నాయకులు పాల్గొన్నారు.