Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
అటవీభూములను సాగు చేసుకున్న గిరిజనులందరికీ హక్కు పత్రాలివ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి డిమాండ్ చేశారు.మండలంలోని శూన్యపాడు గ్రామంలో సూర్యాపేట జిల్లా గిరిజన చైతన్యయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఎన్నో ఏండ్లుగా అటవీని నమ్ముకుని గిరిజనులు,అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు.అనేక ఏండ్లుగా సీపీఐ(ఎం), గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసిన ఫలితంగా 2006లో వామపక్ష పార్టీలు పార్లమెంట్లో బలపరిచిన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తెచ్చిందని గుర్తు చేశారు.అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా గిరిజనులకు ఆరకొర పట్టాలు ఇచ్చారే తప్ప,ఎవరికి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. రాష్ట్రంలో 11 లక్షలా 40వేల మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేసుకుం టున్నారని, వారంతా అటవీహక్కులపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. విషయాన్ని సీపీఐ(ఎం), గిరిజనసంఘం నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించామన్నారు.అందరికీ పట్టాలిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో అది సాధ్యం చేయడం లేదని విమర్శించారు. మునుగోడు ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సాగు చేసుకుంటున్న గిరిజన సోదరులందరికీ పట్టాలిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఫిబ్రవరి నెలలో పట్టాలిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. సీపీఐ(ఎం),సీపీఐ ఒత్తిడి ఫలితంగా నిన్న అసెంబ్లీలో అందరికీ హక్కు పట్టాలిస్తామని చెప్పారని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో 11 లక్షల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగు లక్షల మందికి హక్కు పత్రాలు ఇస్తామనడం న్యాయం కాదన్నారు.సాగు చేసుకుంటూ అనుభవిస్తూ దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన కుటుంబానికి హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణగిరిజన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంతప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంఘం చేస్తున్న పోరాటంలో పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు.200 మంది పోడు భూములకు పట్టాలివ్వాలని దరఖాస్తు చేసుకుంటే కేవలం 83 కుటుంబాలకే పట్టాలు ఇవ్వాలని డీఎల్సీ నిర్ణయించడం అన్యాయ మన్నారు.పాలకీడు మండలంలో 2004 మంది దరఖాస్తు చేసుకున్నారని కేవలం 49 మందిని ఎంపిక చేశారన్నారు.ఇది అవాస్తవం ఆశాస్త్రీయంగా ఉన్నదని దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన కుటుంబాలను విచారణ చేసి ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్, సహాయ కార్యదర్శి మడావత్ రవినాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలు నాయక్, రాజేందర్ నాయక్, పాండునాయక్, పాపానాయక్, ఉదయనాయక్, రాజునాయక్, హతీరామ్ నాయక్, కిషన్‌నాయక్, చంద్రసింగ్నాయక్, వాలీబాయి,రత్నావతి, వినోద్ పాల్గొన్నారు.