Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం నిబంధన అమలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి
- మెరుగైన ర్యాంకు కోసం కషి
- నవతెలంగాణతో డీఐఈఓ దస్రు నాయక్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 15 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సంబంధిత శాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాల నిఘా నీడలో మాస్ కాపీంగ్, చూచిరాత ఘటనలకు తావు లేకుండా పర్యవేక్షణకు సిద్ధం చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇదే క్రమంలో రాత పరీక్షల నిర్వహణకు అధికారుల సమయత్తంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్‌తో నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. గత ఏడాది ఫలితాలలో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచాం. ఈ స్థానం మరింత మెరుగయ్యేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. విధివిధానాలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశామని, ఏప్రిల్ 4 వరకు పరిక్షలు కొనసాగుతాయని వివరించారు.
జిల్లాలో పరీక్షా కేంద్రాలు, విద్యార్థుల సంఖ్య ఎంత?
జిల్లావ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. 14,915 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 15,761 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థుల కోసం జిల్లాలో 12 ప్రభుత్వ కళాశాలలో 3 మోడల్ స్కూల్లు, 10 రెసిడెన్షియల్ స్కూలు, 22 ప్రయివేట్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.
పరీక్షా కేంద్రాలలో మాస్ కాపీంగ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు లేనప్పటికీ పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. రెండు ఫ్లయింగ్, 4 సిటింగ్ స్క్వాడ్లు, డీఈసీ బందం, హెచ్పీసీ కమిటీ ఉంది. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. పరీక్ష పత్రాలను సీసీ కెమెరా ముందు తెరచి పరీక్ష గదిలోకి చేరవేస్తారు. సమాధాన పత్రాలను అక్కడే ప్యాకింగ్ చేస్తారు. ఒక సీఎస్, డీివోలు మాత్రమే విద్యార్థుల హాజరు నమోదు కోసం సెల్ ఫోను వినియోగిస్తారు. మిగతా ఏ ఒక్కరు వాడటానికి వీలు లేదు. పరీక్షా కేంద్రానికి సమీపంలో జిరాక్స్ కేంద్రాల మూసివేత, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
విద్యుత్, ఆర్టీసీ, వైద్యాధికారులతో మాట్లాడడం. త్రాగునీరు ఏర్పాటు, సమయానికి అనుకూలంగా బస్సు సౌకర్యం, తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటుతో పాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం ఉంటారు.
నిమిషం నిబంధన ఉందా? విద్యార్థులకు ఇచ్చే సూచన ఏంటి?
నిమిషం నిబంధన అమల్లో ఉంది. ఉదయం 8 నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. తొమ్మిది గంటల తర్వాత నిమిషం ఆలస్యమైన ఎట్టి పరిస్థితులలో అనుమతి ఉండదు. విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి. దూర ప్రాంతాల నుండి వచ్చేవారు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
హాల్ టికెట్ల జారీ విషయంలో విద్యార్థులకు సమస్యలు వస్తూ ఉంటాయి..ప్రైయివేట్ యాజమాన్యాలు ఇవ్వకుంటే ఎలా?
ఇంటర్ బోర్డ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఫీజుల పేరిట ఏ ఒక్క విద్యార్థి హాల్ టికెట్ ఆపడానికి వీలు లేదు. నెట్ నుండి విద్యార్థులే నేరుగా హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం లేకుండా పరీక్షకు అనుమతి ఉంది. ఈ విషయంలో అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.
విద్యార్థులు ఒత్తిడి అధిగమించాలంటే ఎలాంటి సూచన చేస్తారు?
పరీక్షల సమయంలో విద్యార్థులు సమయానికి అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలి. తల్లిదండ్రులు సహకరించాలి. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకునేలా సన్నద్ధం కావాలి.
సమస్యాత్మక కేంద్రాలు ఏమైనా ఉన్నాయా?
నల్లగొండ జిల్లాలో సమస్యత్మక ప్రరిక్షా కేంద్రాలు ఎక్కడా లేవు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
పరీక్షా కేంద్రాల చిరునామా, పేరు మార్పు వంటి సమస్యలు ఉంటే ఎలా?
జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలు పాతవే. కేంద్రాల మార్పు లేదు. విద్యార్థులు హాల్ టికెట్ తీసుకోగానే పరీక్షా కేంద్రం నెంబర్‌తో సంబంధిత కళాశాల ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. పరీక్షకు ఒకరోజు ముందే కేంద్రాన్ని గుర్తించాలి. అప్పుడు నేరుగా వెళ్ళటానికి అవకాశం ఉంది.
గత ఏడాది జిల్లా ర్యాంక్ ఎంత? ఈసారి ఏ ర్యాంకు ఆశిస్తున్నారు?
గత ఏడాది ఫలితాలలో నల్లగొండది 8వ స్థానం. ఈసారి స్థానం మరింత మెరుగయ్యేందుకు కషి చేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక స్టడీ అవర్స్, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాం.