Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యకార్యకర్తల సమావేశంలో డబ్బికార్
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వాటిని తిప్పుకొట్టేందుకు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను ప్రతిఘటించాలని చెప్పారు. కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించాలని, కొన్ని దినాలు తగ్గించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తత చేయాలని డిమాండ్లతో 10 లక్షల మందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మూడవత్ రవినాయక్, కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిలుట్ల సైదులు, ఐద్వా నాయకులు గాదె పద్మ, నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశురాములు, ఆయూబ్, సైదమ్మ, కందుకూరి రమేష్, గోవింద్‌రెడ్డి, రాంచంద్రు తదితరులు పాల్గొన్నారు.