Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హలియా
రైతన్నలు నేటి పరిస్థితులలో సేద్యానికి కొండంత పెట్టుబడి పెట్టినా గోరంత లాభం కూడా రావట్లేదని, తక్షణమే రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలని రైతు సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హాలియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తికి కేవలం రూ.6,600లు మాత్రమే నిర్ణయించిందని, ఆ ధరని కూడా సీసీఐ అమలు చేయకపోవడంతో దళారీల చేతిలో రైతులు దగాకు గురవుతున్నారని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ఏడాది తెలంగాణలో పత్తి నకిలీ విత్తనాలు అధికంగా విస్తరించాయని, దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులకు అండగా ఉంటున్న సహకార సంఘాలపై కూడా కేంద్రం కుట్ర పన్నింది. రాష్ట్ర సహకార సంఘాల బిల్లు 2022 తెచ్చి ఆ గొడుగు కిందికి అన్ని సంఘాలను తీసుకొచ్చి లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్న సహకార సంఘాలను కార్పోరేట్ చేతుల్లో పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షలకుపైగా ఎకరాలకు వరి సాగవుతుందని, లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ధాన్యం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై కోపంతో కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తుందని ఆవేదన వ్యక్తపరిచారు.
రాష్ట్ర ప్రభుత్వం నాగర్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు జరపాలని, ఈ నియోజకవర్గంలో బత్తాయి సాగు అధికంగా చేస్తున్నారని, పెద్దవూరలో జ్యూస్ ఫ్యాక్టరీ తక్షణమే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాలియాలో 48 సర్వే నంబర్లో ఉన్న నివాస పేదలందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, తక్షణమే రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు పొదిలి వెంకన్న, కారంపూడి ధనమ్మ, టావత్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.