Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్మీడియట్ పరీక్షల పై కలెక్టర్ సమీక్ష
- పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంది
- సెంటర్ వద్ద 144 సెక్షన్ విధింపు
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరి రూరల్
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే హాల్ టిక్కెట్ తో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కాన్ఫరెన్స్ హలులో అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 9121147135, 08685-293312 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.. ఈనెల 15 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 6206, రెండవ సంవత్సరం విద్యార్దులు 7103 మంది కలిపి మొత్తం 13,309 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లాలో భువనగిరి డివిజన్లో భువనగిరి 9, ఆలేరు 2, యాదగిరిగుట్ట 1, మోత్కూరు 2, రాజపేట 1, బొమ్మలరామారం 2, చౌటుప్పల్ డివిజన్లో రామన్నపేట 2, వలిగొండ 2, చౌటుప్పల్ 5, పోచంపల్లి 2, నారాయణపూర్ 3, మండలాలలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల కట్టుదిట్టమైన నిర్వహణకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ టీమ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ టీములు పరిశీలిస్తాయని, అలాగే ముగ్గురు కస్టోడియన్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తాయని, సీసీి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల కోసం ఆర్టీసీ బస్సులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో మంచినీటి వసతి, టాయ్‌లెట్స్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మందులతో మెడికల్ పాయింట్ ఉంటుందని, పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని, జీరాక్సు సెంటర్స్ మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు రాస్తున్న 29 ప్రయివేటు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల ఫీజుతో నిమిత్తం లేకుండా హాల్ టిక్కెట్స్ జారీ చేయాలని, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే హాల్ టిక్కెట్ తో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ పరీక్షా సమయం ఉదయం 9 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలుకు అనుమతించబోమన్నారు. పరీక్షకు హజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్ తీసుకొనిరావడానికి అనుమతి లేదని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి కెవి. ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ వెంకటరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, ఆర్టీసీ డివిజనల్ మేనేజరు శ్రీనివాస గౌడ్, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి, పోస్టల్ శాఖ అధికారి వీరనారాయణ, కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.