Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అచెతన స్థితిలో నిర్మాణ పనులు
- పట్టింపేదంటున్న ప్రజలు
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు రైల్వే గేట్ అండర్ పాస్ ,ఆలేరు మున్సిపల్ భవన నిర్మాణం నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలనిపట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆలేరు అండర్ పాస్ రైల్వే గేట్ వద్ద నిర్మాణ పనులు వెనుకనుయ్యి ముందు గొయ్యి అన్న చందంగా మారింది. పురపాలక సంఘ భవన శంకుస్థాపన పనులు వెంటనే చేపడుతామని, మున్సిపల్ కార్యాలయ ఫర్నిచర్ తరలింపు సమయంలో పాలకులు చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం ఉట్టిదే అయ్యింది. రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు పురపాలక సంఘ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి బైపాస్ పై ప్రయాణం చేయాలన్న, ఎటువైపు వెళ్ళాలన్న,దాదాపు 3 నుండి 5, 6 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రజలు తమ కార్యపు కలపాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది.
1970లో నిర్మించిన ఆలేరు మేజర్ గ్రామపంచాయతీ భవనాన్ని పాత వెలుగు కార్యాలయంకు తరలించడంతో ఆలేరు పట్టణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టయ్యిందని ప్రజలు వాపోతున్నారు. 1965- 70 మధ్యకాలంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రయాసలకోర్చి , గ్రామ ప్రజల సహకారంతో ఆరు గదులతో విశాలంగా నిర్మించిన భవనమది. పురపాలక సంఘ ఫర్నిచర్ తరలించిన, ఆరు నెలల తర్వాత కూల్చివేసి, శిధిలమును యంత్ర సహాయంతో, వాహనాలలో ఇతర చోట్లకు తరలించారు. సెప్టెంబర్లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనం కూల్చివేశారు. నూతన పురపాలక కార్యాలయం నిర్మాణానికి 2021లోనే పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుతో, రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత తగ్గిన నిధులు మంజూరు చేస్తానని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రజలకు హామీ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని పాత పురపాలక సంఘ భవనం సందర్శనకు వచ్చినప్పుడు గతంలో హామీ ఇచ్చారు. భవన నిర్మాణ పనులు మాత్రం ఆచరణలో ఆమడ దూరంలో ఉన్నాయి. రైల్వే గేట్ , పురపాలక సంఘ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికేతర్ల పెత్తనం కారణంగానే ఆలేరు పట్టణ అభివృద్ధి కుంటుపడింది - స్థానికులు ఎండి. ఖలీల్
పట్టణాభివృద్ధిలో స్థానికేతర్ల పెత్తనంతోనే , అభివృద్ధి ఆమడ దూరం అన్న చందంగా మారింది. స్థానిక రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తి కాకపోతే , దాని పరిణామాలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో పట్టణంలో అభివృద్ధి పనులు జరగలి.
పాత గ్రామపంచాయతీ కార్యాలయం స్థలంలో, కొత్త పురపాలక సంఘ కార్యాలయం వెంటనే నిర్మించాలి
పగడాల రాంబాబు స్థానికులు
ఆలేరు పట్టణ మేజర్ గ్రామపంచాయతీ పురాతన భవనం అని , నూతనంగా నిర్మిస్తామని కార్యాలయాన్ని వెలుగు కార్యాలయం భవనంలోకి తరలించారు. ప్రజల ఆత్మగౌరవాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా ధర్నాలు , రాస్తారోకోలు రిలే దీక్షలు చేసినప్పటికీ, ప్రజల అభిమాతానికి విరుద్ధంగా తరలించారు. కార్యాలయాన్ని పాత స్థలంలోనే నిర్మించాలి.
పారిశుధ్య పనులు అస్తవ్యస్తం
మహిళా సమైక్య అధ్యక్షురాలు మాటూరు జానమ్మ
ఆలేరు పట్టణంలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. డ్రెయినేజీ కాలువలు ఫిబ్రవరి నెలలో శుభ్రం చేసి మళ్లీ ఇంతవరకు రాలేదు. సమస్యలను పరిష్కరించాలని పురపాలక సంఘం చైర్మెన్, అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తే పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉందని వారంటున్నారు.