Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారం అందేనా....?
నవతెలంగాణ-పెన్పహాడ్
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుండి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే 'సమాచార హక్కు'. పాలనలో పారదర్శకతను పెంచి అవినీతిని అరికట్టేదే సమాచార హక్కు చట్టం. భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 న సమాచార హక్కు చట్టాన్ని దేశం అంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులెవరైనా పొందవచ్చు. ఒకప్పుడు పార్లమెంటు లేక విధానసభ, విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికీ కలిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు పౌరులు అడగకపోయినా వారంతటవారే విధివిధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారుల పేర్లు, అప్పిలెట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను ప్రజలకు కనిపించే విధంగా బోర్డు మీద స్పష్టంగా రాసి పౌర సేవా పత్రాన్ని ఉంచాలి. కానీ సమాచార హక్కు చట్టం-2005 క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగాల్లో సమాచారం అందించేందుకు కనీస బోర్డులు కాని, సమాచార కేంద్రాలు కాని ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది.
పీహెచ్సిలో పడకేసిన పౌర సేవా పత్రం
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సమాచార హక్కు చట్టం బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాక పౌర సేవా పత్రాన్ని తీసి పక్కకి పడేసినట్లుగా పడేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టిసారించి సమాచార హక్కు బోర్డు ఏర్పాటు చేసి పారదర్శకంగా చట్టాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.