Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరికీ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని, కార్మికులకు గుదిబండగా మారిన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ కలెక్టరేట్ ముందు సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, నర్సరీ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలు, ఆఫీస్ నిర్వహణ తదితర కేటగిరీలలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వీరి పట్ల మాత్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్ తదితర కార్యక్రమాల్లో జీపీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ సిఫారసుల ప్రకారం జీవో నెంబర్ 60 ఇచ్చిందని, దీనికనుగుణంగా కేటగిరీల వారీగా 15,600,19,500, 22,750 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, జెడ్పీటీసీి, ఎంపీటీసీలకు కూడా వేతనాలు పెంచిన ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులతో మాత్రం వెట్టిచాకిరి చేయిస్తుందని అన్నారు. మల్టీ పర్పస్ విధానం తీసుకొచ్చి సెలవులు, పని గంటలతో నిమిత్తం లేకుండా బానిసలుగా పని చేయిస్తూ వేతనాలు పెంచకుండా, ఉద్యోగ భద్రత లేకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం17 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన ప్రభుత్వానికి కనీసం చలనం లేదని ఇలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పోలే సాంబయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతేపాక వినోద్‌కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, భీమగాని గణేష్, యూనియన్ జిల్లా నాయకులు పొన్న అంజయ్య, గండమల్ల ఆశీర్వాదం, ఎండీ.జహీర్, ఏర్పుల సైదులు, పగిడిమర్రి సర్వయ్య, రమావత్ రమేష్, ఎర్ర అరుణ, జ్యోతి, ఏ.కోటయ్య, సైదులు, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.