Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలపై ప్రతిఘటించేందుకు ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం పిలుపునిచ్చారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు రూపాయలు వేస్తామని, వాగ్దానాలు చేసిన మోడీ ప్రభుత్వం దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారిందని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కులను కాల రాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5 న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, మండల నాయకులు మైళ సత్తయ్య, గడిగోటి వెంకటేష్, పెరుమాండ్ల మంజుల, నందిపాటి సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.