Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ఎట్టకేలకు మండల పరిధిలోని కలకోవ గ్రామంలో మంగళవారం మత్స్యకార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.3 పర్యాయాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు తాజాగా హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఉదయం ఎనిమిది గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.మొత్తం 42 మంది సభ్యులు ఉన్న సహకార సంఘంలో ఇద్దరు సభ్యులు మరణించారు.ఇంకా 40 మంది సభ్యులు ఎన్నికలకు హాజరు కావాల్సి ఉండగా 34 మంది మెజారిటీ సీపీఐ(ఎం) సభ్యులు హాజరయ్యారు. కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు.మత్స్య సహకార సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎ న్నుకోవాల్సి ఉంది.ఎన్నికలకు హాజరైన సభ్యుల్లో 9 మంది నామినేషన్లు వేశారు.నామినేషన్ వేసిన అభ్యర్థులకు మరోవర్గం నుంచి పోటీ లేకపోవడంతో 9 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం నూతనంగా ఎన్నికైన 9 మంది డైరెక్టర్లు,అధ్యక్షుడిగా అనంత గురవయ్యను,ఉపాధ్యక్షుడిగా పాతకోట్ల లింగయ్య,కార్యదర్శిగా బుర్రి బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మత్స్య సహకార సంఘానికి డైరెక్టర్లుగా పోటీ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నికల నియమా వళి ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారి డి.నాగేశ్వరరావు తెలిపారు.ఎన్నికల సందర్భంగా కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పలువురు ఎస్సైలు, 120 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బంది ప్రహారా మధ్య ఎన్నికలను సజావుగా నిర్వహించారు.ఎన్నో రోజులుగా వివాదంలో ఉన్న కలకోవ మత్స్య సహకార సంఘం చెరువు ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించింది.