Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
గుట్టల మీద గుడిసెలేసుకుని నివాసముంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో ఆ ఇండ్ల తాళాలు పగలగొట్టి జొరబడ్డ కాలనీవాసులు రెండవ రోజు మంగళవారం ఇండ్లలోనే నివాసం ఉన్నారు.దేవరకొండ పట్టణంలోని 6 వ వార్డులోని డ్రామా కాలనీకి చెందిన 30 కుటుంబాలు ,16వ, 19వ, వార్డుకు చెందిన మరో 10 కుటుంబాలు సోమవారం పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకున్నారు.రాత్రి అక్కడే వంట చేసుకుని బస చేశారు.తమకు డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.మంగళవారం ఉదయం గృహాల కిటికీలు ధ్వంసం చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో రెవెన్యూ, పోలీసుల యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.డబుల్ బెడ్ రూమ్ గృహాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా మీరే బాధ్యులని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు.అరెస్టు చేసేందుకు పోలీసు బలగాలతో డబుల్ బెడ్ రూమ్ స్థలానికి పోలీసులు చేరుకున్నప్పటికీ కాలనీవాసులు తమను అరెస్టు చేసినా సరే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఖాళీ చేయమని భీష్మించుకూర్చున్నారు.దీంతో తహసీల్దార్ రాజు, ఆర్ఐ వెంకట్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు.వారి నుండి ఆధార్ కార్డు నెంబర్‌తో సహా మళ్లీ దరఖాస్తులను తీసుకున్నారు.సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.అయినప్పటికీ అక్కడే కూర్చొని నిరసన తెలిపారు.తాము మాత్రం గృహాలను ఖాళీ మాత్రం చేయబోమని బైఠాయించారు.గృహాలకు నష్టం వాటిల్లేలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు, సీఐ, హెచ్చరించారు.సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆందోళనలు,నిరసనలు, చేసి ఇబ్బందులకు గురికావొద్దన్నారు.దేవరకొండ ఎస్ఐ సతీష్, కొండమల్లేపల్లి ఎస్సై వీరబాబు, డిండి ఎస్ఐ యాదయ్యలు బందోబస్తు ఏర్పాటు చేశారు.