Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో మల్టీపర్పస్ వర్కర్లు
- 6 నెలలుగా వేతనాల్లేవు
- ఏండ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత కరువు
నవతెలంగాణ -నల్లగొండ
పల్లెల్లో పంచాయతీ కార్మికులు లేకుంటే పారిశుధ్యం అస్థవ్యస్తంగా తయారవుతుంది. నిత్యం గ్రామాల్లో చెత్తా చెదారం సేకరించి డంప్ యార్డులకు చెత్తను తరలించడంలో పంచాయతీ కార్మికులదే కీలకపాత్ర. వారు లేనిదే గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు. కానీ అలాంటి వారి పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కార్మికులు వాపోతున్నారు. నెలానెలా సరిగా వేతనాలు అందక తీవ్రఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్టగా మార్చి వారికి నెలనెలా వేతనం రూ.8,500 అందిస్తోంది. కానీ అవి సరిగా అందకపోవడంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో 844 గ్రామపంచాయతీలుండగా, వాటి పరిధిలో 2700 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అనధికారికంగా మరో 300మంది విధులు నిర్వహిస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వీరిని మల్టీపర్పస్ వర్కర్లుగా పిలుస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మొదలు, ఆయా జీపీ కార్యదర్శులకు సహాయకారులుగా, పన్నుల వసూళ్లు, విద్యుత్ సమస్యలు, ట్రాక్టర్నడపడం, నర్సరీ, డంప్‌యార్డు, శ్మశానవాటిక, తాగునీరు, ఇలా గ్రామాల్లో ఏ పనులు ఉన్నా వారే చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉండడం లాంటి పనులు తలకు మించిన భారం అవుతోంది. అయినా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వేతనాల కోసం తప్పని ఎదురు చూపులు
జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికులకు 6నెలలుగా వేతనాలు అందడం లేదని కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. దీంతో ఎదురుచూపులు తప్పడం లేదు. నెలకు వారికి రూ.8,500 అందిస్తుండగా పనికి తగిన వేతనం అందడం లేదని, నెలనెలా వేతనాలు అందక పోవడంతో అనేక అవస్థలు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు. గ్రామాల్లో జనాభా ప్రకారం 500మంది జనాభాకు ఒక్క కార్మికుడు విధులు నిర్వహించాల్సి ఉండగా, జనాభా ఎక్కువ ఉన్న జీపీల్లో పని భారం ఉంటోందని వాపోతున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి తమకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచా యతీ కార్మికులు కోరుతున్నారు.
వేతనాలు సకాలంలో చెల్లించాలి..
మల్లేష్( అనంతారం) (పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్)...
గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నెలనెలా వేతనాలు అందజే యాలి. జిల్లా యంత్రాంగం పంచాయతీ కార్మికుల పట్ల చిన్నచూపు తగదు. కార్మికుల మందిరం వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. అలాంటి వారికి తీవ్రఇబ్బదులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలి.
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ
గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు అందజేయాలి. మల్టీపర్పస్ ను రద్దుచేసి కార్మికులను పర్మినెంట్ చేయాలి. జీవో 60 తో మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచిన విధంగా గ్రామపంచాయతీ వర్కర్ల వేతనాలు పెంచాలి. లేనియెడల భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలు నిర్వహిస్తాం.