Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలు రాయనున్న 13,309 మంది విద్యార్థులు
- టోల్ ఫ్రీ నెంబర్ 14416
- అమల్లో నిమిషం నిబంధన
నవతెలంగాణ - భువనగిరి
నేటి15 నుండి ఏప్రిల్4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా సమయం ఉదయం 9 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలుకు అనుమతించబడరు.
13,309 విద్యార్థుల హజరు.
మొదటి సంవత్సరం విద్యార్థులు 6206, రెండవ సంవత్సరం విద్యార్దులు 7103 మంది కలిపి మొత్తం 13,309 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో భువనగిరి డివిజన్లో భువనగిరి 9, ఆలేరు 2, యాదగిరిగుట్ట 1, మోత్కూరు 2, రాజపేట 1, బొమ్మలరామారం 2, చౌటుప్పల్ డివిజన్లో రామన్నపేట 2, వలిగొండ 2, చౌటుప్పల్ 5, పోచంపల్లి 2, నారాయణపూర్ 3 మండలాలలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల కట్టుదిట్టమైన నిర్వహణకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక జిల్లా ఎడ్యుకేషన్ కమిటీ టీమ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ టీములు పరిశీలిస్తాయి, ముగ్గురు కస్టోడియన్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తారు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ వార్షిక పరీక్షలను కట్టుదిటమైన ఏర్పాట్లతో ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించానున్నారు. ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416ను ఏర్పాటు చేసింది. పరీక్షల సమయంలో ఆందోళనకు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో,040-24601010 జిల్లాలో పరీక్షల నిర్వహణకు 9121147135, 08685-293312 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆయా నెంబర్లలో సందేహాల నివృత్తి కోసం సంప్రదించవచ్చు. పరీక్షల సమయంలో విద్యార్థులకు వివిధ రకాల సేవలు అందించేందుకు టీఎస్బీఐఈఎం సర్వీసెస్ మొబైల్ యాప్ వినియోగించుకోవచ్చు ., పరీక్షా కేంద్రం వివరాలు ఆ యాప్లో ఉంటాయి.
గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే హాల్ టిక్కెట్ తో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల కోసం ఆర్టీసీ బస్సులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో మంచినీటి వసతి, టాయిలెట్స్ సౌకర్యం కల్పించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మందులతో మెడికల్ పాయింట్ , పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని, జీరాక్సు సెంటర్స్ మూసివేస్తారు. ప్రతిరోజూ పరీక్ష అనంతరం జవాబు పత్రాల పార్సెల్ రిసీవింగ్ సెంటర్ చేరేలా పోస్టల్ శాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు వ్రాస్తున్న 29 ప్రయివేటు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల ఫీజుతో నిమిత్తం లేకుండా హాల్ టికెట్స్ జారీ చేయాలని, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్షకు హజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్, క్యాలిక్యులేటర్ తీసుకొనిరావడానికి అనుమతిచ్చారు.