Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్
నవతెలంగాణ-భువనగిరిరూరల్
గ్రామపంచాయతీ కార్మికులకు బకాయిగా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ కోరారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా పంచాయతీ కార్మికుల జీతాలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనేది ఉండదని, కనీస వేతనాలు కార్మిక చట్టాలు అమలు చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ,మంత్రులకు, ముఖ్యమంత్రి జీతాలు పెంచుకున్నదన్నారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తూ, వైటీ చాకిరి చేయించుకుంటున్నదని 51 జీవో తీసుకొచ్చి ఒకే కార్మికుడు అన్ని పనులు చేసేలా చేసిందన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఈఎస్ఐ, పీఎఫ్ బీమా సౌకర్యం కల్పిస్తూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 21 చెల్లించాలని అధికారుల వేధింపులు రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి , గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దాసరి పాండు, ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, నాయకులు యాదగిరి, బాబు రమేష్ , శ్రీశైలం పరమేశు, సలీం, శంకర్, ఎల్లేష్ పాల్గొన్నారు.