Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రుణ సౌకర్యం ఎక్కువ అందించాలని జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో గత డిసెంబరు చివరి వరకు త్రైమాసిక రుణ ప్రగతిపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్యాంకులు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకరంగా అధిక సంఖ్యలో రుణాలు అందించాలని, అనుబంధంగా వున్న కూరగాయలు, కోళ్ల పరిశ్రమలు, గేదెలు తదితర రంగాలలో ఎక్కువ సాగు అవుతున్నందున వారికి చేయూతనందించేందుకు అధిక రుణాల సౌకర్యం కల్పించాలని కోరారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఋణాల ప్రగతిని ఇంకా ఎక్కువ సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, ప్ర్రాముఖ్యత రంగాలలో లబ్దిదారులకు సకాలంలో రుణ సౌకర్యం కల్పించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ఈనెలాఖరు లోగా రుణాల మంజూరు పూర్తి చేసుకొని లక్ష్యాలను సాధించాలని తెలిపారు. గత డిసెంబర్ వరకు త్రైమాసిక ప్రగతి పట్ల ఆమె బ్యాంకుల వారిగా సమీక్షిస్తూ, 1856 కోట్లు వ్యవసాయ రుణాలుగా అందజేసినట్టు తెలిపారు. ఇందులో పంట రుణాలుగా 919 కోట్లు, దీర్గకాలిక రుణాలుగా 937 కోట్లు అందించినట్టు తెలిపారు. సూక్ష్మ రుణాల కింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు 269 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు., ప్రాధాన్యతా రంగాలకు 78 కోట్లు అందించినట్లు తెలిపారు. విద్యా రుణాలు 76 కోట్లు, గృహ నిర్మాణ రుణాలు 40 కోట్లు, అప్రాధాన్యతా రంగంలో విద్యా రుణాలు 66 కోట్లు, అలాగే గృహ నిర్మాణంలో 110 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు 12,747 సంఘాలకు గాను 7511 సంఘాలకు 586 కోట్లకు గాను 433 కోట్లు అందించి 74 శాతాన్ని సాధించినట్లు తెలిపారు. అర్హత ఉన్న సంఘాలకు రుణాలు వెంటనే అందించాలని, రెన్యువల్లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో ఒక శాతం మాత్రమే ఎన్పీఏ (మొండి బకాయిలు) కలిగి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో వుందన్నారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తున్న మహిళా సంఘాలను ఈ సందర్భంగా అభినందిస్తున్నా మన్నారు. మెప్మా కింద బ్యాంక్ లింకేజ్ రుణాలకు సంబంధించి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 2688 మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 20 వేలు చొప్పున 5 కోట్ల 37 లక్షలు అందించి 63.34 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు.నాబార్డు ద్వారా ఎఫ్‌పిఓలకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి, అడ్డగూడూరు మండలం సింగారం గ్రామాలలో బ్రాంచీలు ప్రారంభించాలని బ్యాంకు కంట్రోలర్స్‌కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రీరామకృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధి విభవ్ వ్యాస్, నాబార్డు డిడిఎం వినయకుమార్, కెవిఐసి ప్రతినిధి సంజీవరావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఇడి శ్యాంసుందర్, జిల్లా పశుసంవర్ధక అధికారి కృష్ణ, మెప్మా పిడి రమేశ్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.