Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని అనంతారం గ్రామ శివారులో గల వెన్నెల కళాశాలలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వచ్చే ఏప్రిల్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పరస్పర సమన్వయంతో, పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 267 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల ద్వారా 9059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించి పారిశుద్యం, టాయిలెట్స్ సరిగా వుండేలా చర్యలు తీసుకోవాలని, మంచినీటి సదుపాయం, ఓఆర్ఎస్. ప్యాకెట్లు, మందులు, వైద్య సిబ్బంది, అవసరమైన వసతుల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో సమయపాలన కచ్చితంగా పాటించాలని, చీఫ్ సూపరింటెండెంట్ గదులలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు ఉండాలని, పరీక్ష ముందు రోజు ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు కృష్ణారెడ్డి, పాండు మండల విద్యాశాఖ అధికారి నాగవర్ధన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.