Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ
నవతెలంగాణ- చిట్యాలటౌన్
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ.లక్ష్మీనారాయణ అన్నారు. చిట్యాల పట్టణంలోని కష్ణవేణి టాలెంట్ స్కూలు బ్లో సోమ్ 2023 కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలకు సంస్కారం నేర్పడంలో అశ్రద్ధ చూపడం వల్ల తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించే దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వడం కన్నా, పిల్లలని దేశానికి మంచి సంపదగా అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు ఫేస్బుక్ కాదు చూసేది మీ ఫేసును బుక్కుల్లో రాయాలని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ,సావిత్రిబాయి పూలే, భగత్ సింగ్ ,చంద్రశేఖర్ ఆజాద్ ,కొమరం భీం ,అంబేద్కర్ అలాంటి మేధావులని దేశానికి అందించే కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు తాము చదివే పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చే విధంగా వాళ్ళ సంతకాలు ఆటోగ్రాఫర్లుగా మారాలని ఆకాంక్షించారు. కులమతాలు లేని భారతదేశ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బొడ్డు యాదగిరిగౌడ్, డైరెక్టర్ కే.శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.