Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాలిన బత్తాయి,తడిసి ముద్దైన మిర్చి
- దెబ్బతిన్న ఇండ్ల పైకప్పులు
- మిర్యాలగూడలో పిడుగుపాటు
- ఉరుములు , మెరుపులతోకూడిన భారీ వర్షం
- నాంపల్లిలో పడిన రాళ్ల వాన
వాతావరణ శాఖమార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని ముందే వెల్లడించింది. ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని సూచన చేశారు. గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు కూరిసిన వడగండ్ల వనకు నల్లగొండ జిల్లాలో పలుమండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
నవతెలంగాణ-నాంపల్లి
ఆరుగాలం, అహర్నిషలు కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేతికి పంట అందే సమయానికి వర్షం సృష్టించిన బీభత్సం రైతులకు విషాదాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం సుమారు అరగంట సేపు ఉరుములు, మెరుపులతో, గాలి దుమారంతో కురిసిన రాళ్లవాన వల్ల నాంపల్లి మండలంలో చాలా చోట్ల రైతులకు అపార నష్టం జరిగింది.
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన దోనాల శేఖర్ అనే రైతు ఇదే గ్రామంలో మూడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని 1,50,000 పైగా ఖర్చు చేసి టమాటా తోటను పెట్టారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సంతోషంలో రైతు ఉండగా గురువారం సాయంత్రం కురిసిన అకాల రాళ్ల వర్షానికి టమాటా చెట్లు మొత్తం విరిగిపోయి పూత, పిందె పూర్తిగా రాలిపోయి ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతు కన్నీరు పెట్టుకున్నారు. అదేవిధంగా మండలంలోని జాన్ తండా గ్రామపంచాయతీ లోని దొరోనిగడ్డకు చెందిన మెగా వత్ పర్ష, మెగావత్ నరేష్‌లు తమ సొంత గ్రామంలో మూడు ఎకరాలు, నాంపల్లి మండల కేంద్రంలో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంటను వేశారు. పంట రెండు రోజుల్లో కోయడానికి అన్ని సంసిద్ధం చేసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం నేలరాలి మిరప పండ్లు పగిలిపోవడం జరిగింది. 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ తను భారీగా అప్పుల పాలు కావడం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నాడు.
పెద్దాపురం గ్రామపంచాయతీలోని బోయగూడానికి చెందిన సుధనబోయిన రమేష్ అనే రైతు చేతికి వచ్చిన పుచ్చకాయ పంట రాళ్ల వానతో మొత్తం కాయలు పగిలిపోయి ధ్వంసం అయినాయని, పూత పిందే దశలో ఉన్న దోస పంట పూర్తిగా పనికిరాకుండా పోయిందని తెలిపారు. పొట్ట దశలో ఉన్న వరి పంట గాలి, రాళ్లవానకు ధ్వంసం అయినాయని తీవ్ర నష్టం వాటిల్లిందని తెలియజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు వేడుకుంటున్నారు.
పెద్దవూర : అల్పపీడన ద్రోణి ప్రభావంతో గురువారం పెద్దవూర మండలంలో ఒక గంట పాటు భారీ వర్షంపాతం నమోదైంది. మండలంలో మిర్చి పంటకోసి కల్లాలలో ఎండబెట్టారు. చాలా వరకు ఆరబెట్టిన మిర్చి తడిసిపోయినట్లు తెలుస్తుంది. చేతికి వచ్చిన మిర్చి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతులకు సమయానికి పట్టాలు లేకపోవడంతో మిర్చి తడిసిపోయిందని ఆందోళన చెందుతున్నారు.
మర్రిగూడ : మండలంలోని పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం మొదలుకొని రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి గ్రామాలన్నీ అతలాకుతులమయ్యాయి. పొట్ట కొచ్చిన వరిసేను, నిమ్మ, మామిడి, బత్తాయి, తోటలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. ఈ ఏడాది పత్తితో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతు, వడగండ్ల వాన తెచ్చిన నష్టాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నాడు.ఈదురు గాలులతో కొన్ని ఇంటి పైకప్పులు సైతం ఎగిరిపోయాయి. చెట్లు నేలకొరిగాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందిన గంటా శ్రవణ్‌రెడ్డి ఇంటిలో గురువారం సాయంత్రం పిడుగు పడింది. ఉరుముల మెరుపులతో పిడుగుపాటు జరగడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి ఫర్నిచర్ దగ్ధమైంది. సుమారుగా 9 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆగ్రోస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పి వెంకటగిరి, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, సీిఐ రాఘవేందర్‌లు సందర్శించి వివరాలు సేకరించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.