Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మహిళలు ఆర్ధికాభివృద్ధితో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని, మహిళ ఆరోగ్యంతోనే కుటుంబ శ్రేయస్సు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్య కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు వివిధ రంగాలలో రాణించాలని, ముఖ్యంగా ఆర్ధికాభివృద్ధితో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలన్నారు. మహిళల ఆరోగ్యంతోనే వారి కుటుంబ శ్రేయస్సు ఉంటుందని అన్నారు. జిల్లాలో బ్యాంకులు మహిళల ఆర్ధిక అభ్యున్నతికి కావలసిన ఋణ సౌకర్యం అందిస్తున్నందున స్వంత అవసరాలకు కాకుండా వ్యాపార రంగాల వైపు తమ దృష్టి సారించాలని, ఆర్ధిక స్వాలంబన సాధించాలని, జిల్లాలో ఎన్పీఏ మొండి బకాయిలు కేవలం ఒక శాతం లోపే ఉన్నందున బ్యాంకర్లు కూడా మీ ఇష్టమైన రంగంలో రుణ సౌకర్యం అందిస్తాయన్నారు. కుటుంబ ఆరోగ్యం కోసం ప్రతి మహిళ తమ ఇళ్లలో కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు తగిన శ్రద్ధతో పెంచాలని సూచించారు. అలాగే హైదరాబాదుకు జిల్లా దగ్గరగా వున్నందున పుట్టగొడుగుల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని, ఇది పౌష్టిక గుణాలు కలిగి వున్నందున మంచి మార్కెట్ సౌకర్యం ఉంటుందని అన్నారు. సమాఖ్యల నిర్వహణలో కలిగే లోటుపాట్లు, వ్యాపార లాభ నష్టాలు, పొదుపు, ఋణాలపై ప్రతి నెలా చర్చించడం, లోపాలను ఎదుర్కొనే విషయాలపై సూచనలు, సలహాలను అందజేశారు.