Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెలు బాదుకుంటున్న రైతన్నలు...!!
- నిబంధనలకు పాతర, రోడ్లపై లారీల జాతర
నవతెలంగాణ-నల్లగొండ
బడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రీమంతులు ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్న క్రషర్లు ఆ ఊరి రైతుల పాలిట శాపంగా మారాయి. క్రషర్లతో తమ జీవితాలే ఆగమైపోతున్నాయని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సాగు చేసిన పంటలపై పడిన దుమ్ముతో పంటలు ఎదగలేక తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. దీనికి తోడు రాత్రింబవళ్లు భారీ శబ్ధాలతో సమీప ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వందలాది లారీలు తిరుగుతుండడంతో దుమ్ముతో పాటు రోడ్లూ పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఈ క్రషర్ల కారణంగా నల్లగొండ సమీపంలోనే ఉన్న వెంచర్లు, విల్లాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీనితో ఈ ప్రాంతం ఓ ఎడారిలా మారిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరు చుట్టూ ఏర్పాటు చేసిన క్రషర్లు మా చావుకే పెట్టారంటూ మేళ్ల దుప్పలపల్లి, చందనంపల్లి, రాములబండ, మోటుబాయిగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వాళ్లకు చెందిన క్రషర్లు కావడంతో ఏమనలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న క్రషర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గుట్టలు ఉన్నచోట క్రషర్ మిల్లు ఏర్పాటు...
ఊరు చుట్టుపక్కల గుట్టలు ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేసి కంకర, రాయి, డస్ట్ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నల్లగొండ పరిధిలో ప్రస్తుతం 5 వరకు క్రషర్లు పనిచేస్తున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. 24 గంటల పాటు క్రషర్లు నడుస్తూనే ఉంటాయి.
నిబంధనలకు పాతర.. రోడ్లపై లారీల జాతర...
ప్రజా ప్రతినిధులు, పేరు పొందిన వాళ్లు క్రషర్లు నిర్వహిస్తుండడంతో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక క్రషర్కు అనుమతి తీసుకుని రెండు, మూడు అనధికారికంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 5 నుంచి 25 ఏండ్ల వరకు లీజు తీసుకుంటున్న నిర్వహకులు రికార్డుల్లో తక్కువ భూమి లెక్కలు చెప్పి అనధికారికంగా పక్కన భూమిలో కూడా క్రషర్లు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రోజు వారిగా వందలాది లారీలు కంకర సరఫరాకు రోడ్లపై తిరుగుతుండడంతో దుమ్ము వస్తుంది. ఇలా దుమ్ము రాకుండా రోడ్లపై నీళ్లు పోయించాలని ఆదేశాలున్నాయి. కానీ వాటిని ఎవరూ పాటించడం లేదు. కంకర, డస్ట్ లారీల్లో తరలిస్తున్న సమయంలో దానిపై తాటిపత్రి(కవర్) కప్పి పెట్టాల్సి ఉంటుంది. కానీ లారీల వాళ్లు అలాగే తరలిస్తుండడంతో వెనక వచ్చే వాహనాలపై డస్ట్ పడుతుంది. భారీ లోడుతో లారీలు వెలుతుండడంతో రోజుల వ్యవధిలోనే రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. గుంతలు ఏర్పడి దుమ్ములో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ముతో ఆయా గ్రామాలలో ప్రధానంగా వద్ధులు, పిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు, లీడర్లవే..
జిల్లా కేంద్రంలోని తదితర కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్రషర్లు అన్నీ ప్రజా ప్రతినిధులు, లీడర్లవే కావడం గమనార్హం. స్టేజీల మీద గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే వారు ఇక్కడ గ్రామస్తులు, రైతుల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. 1000 ఎకరాల్లో పచ్చని పంటలతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు ఎడారిగా మారడానికి కారణం ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోరు, ప్రశ్నించిన వారిని బెదిరిస్తుంటారు. దుమ్ము లేవకుండా రోడ్లపై విధిగా నీళ్లు ఎందుకు పోయడం లేదు..? పంటలు సాగు చేయకుండా వ్యవసాయానికే దూరం అవుతున్న రైతులను ఎవరు ఆదుకోవాలి..? దుమ్ముతో వ్యాధుల బారిన పడుతున్న వద్ధులు, పిల్లల పరిస్థితి ఏమిటీ..? అని గ్రామస్తులు క్రషర్లు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ లీడర్లకు క్రషర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టపక్కల అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. ఉన్న ఇళ్లే క్రషర్ల బాంబు పేలుళ్లకు పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీ శివారులోనే ఉన్నప్పటికీ ఇళ్ళ నిర్మాణానికి, వ్యవసాయానికి పనికి రాకుండా పోయిన ఇక్కడి భూములను చూస్తూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. క్రషర్లతో తమ భూములకు ధరలు పలకడం లేదంటున్నారు.
వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం...
క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దుమ్ముతో కొత్త రోగాలు వస్తున్నాయి. ఎన్నో సార్లు కలెక్టర్లు, అధికారులకు ఫిర్యాదులు చేశాం. పర్యావరణం పూర్తిగా కలుషితమైంది. డస్ట్‌తోనే వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడున్న అన్ని క్రషర్లు లీడర్లవే. అన్ని పార్టీల వారివి ఉన్నాయి. వారిని ఎవరు ఏమనలేని పరిస్థితి ఉన్నది. కాయకష్టం చేసి ఇళ్లు నిర్మించుకుంటే బాంబు పేలుళ్లతో పగుళ్లు వస్తున్నాయి. దుమ్ముతో పంటలు పండడం లేదు. ఈ క్రషర్లతో నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇవి ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఊరంత పండుగ చేసుకుంటాం. అధికారులు మా బాధలు అర్థం చేసుకోవాలని మేళ్ల దుప్పలపల్లి, చందనం పల్లి, రాములబండ, మోటుబాయిగూడెం, కాకుల కొండారం, రైతులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ఇబ్బంది కలిగిస్తే నోటీసులు ఇస్తాం
సురేష్‌బాబు (పొల్యూషన్ బోర్డ్ ఈఈ)
రైతులకు ఇబ్బంది కలిగే విధంగా క్రషర్ మిషన్లు నడిపిస్తే నోటీసులు ఇస్తాం. కంకర సరఫరా చేసే సమయంలో దుమ్ము లేవకుండా వాటర్ చల్లాలి. వాటర్ చల్లకుండా దుమ్ము లేపితే ప్రజలు అనారోగ్య బారిన పడతారు. క్రషర్ మిషిన్ సమీపంలో ఉండే రైతులు ఇబ్బంది పడుతున్నట్లయితే పొల్యూషన్ బోర్డుకు సమాచారం అందిస్తే యజమాన్యానికి నోటీసులు అందజేసి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రషర్ మిషన్ యజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలి.