Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదపడుతాయి
- షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు మల్లు స్వరాజ్యం అనేక సమస్యలపై ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మొక్కఓని దీక్షతో పోరాడిందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా నల్లగొండలో మార్చి 17 నుండి 19 వరకు మూడు రోజులపాటు నిర్వహించే షటిల్ టోర్నమెంట్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం యాట గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. సెటిల్ బ్యాట్మెంటన్ ఆడడంతో శరీరంలోని అన్ని అవయవాలు కదిలే విధంగా ఉంటుందన్నారు. క్రీడల ద్వారా రోజురోజుకు మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చన్నారు. బాల్యం నుండి విద్యార్థులకు క్రీడలలో ప్రోత్సహించాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద పాఠశాల యాజమాన్యం బాధ్యత అని అన్నారు. ఈ క్రీడలను నిర్వహిస్తున్న మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులను అభినందించారు. ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఓపెన్ జిమ్ పెట్టుటకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముప్పది ఎకరాల స్థలంలో క్రీడా గ్రామాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మల్లు స్వరాజ్యం తుంగతుర్తి శాసనసభ్యులుగా ఉన్న కాలంలో అనేక గ్రామాలకు కరెంటు, రోడ్లు, పాఠశాలలు నిర్మించారని గుర్తు చేశారు. సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా చిన్నతనంలోనే తుపాకీ పట్టి పోరాడిన ధీశాలని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ప్రజా పోరాటాలే కాకుండ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని, వారు చేస్తున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా కంప్యూటర్ కోచింగ్, టైలరింగ్, కరాటే శిక్షణ, ఉద్యోగ నోటిఫికేషన్లకు ఉచిత కోచింగ్‌తోపాటు గ్రంథాలయ నిర్వహణతో పాటు షుగర్, బీపీ ఫిట్స్, పక్షవాతం రోగులకు ప్రతినెల మూడో ఆదివారం మందులు ఇస్తున్నామని తెలిపారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి మాసంలో గ్రామీణ క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మల్లు స్వరాజ్యం మనవడు, క్రీడల నిర్వహకుడు డాక్టర్ మల్లు అరుణ్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఆర్థో సమస్యలు వస్తే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. షటిల్ బ్యాట్మెంటన్ ఆడే సందర్భంలో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగొని రమేష్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మెన్ గోలి అమరేందర్‌రెడ్డి, మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి, మనుమడు మల్లు అరుణ్, యాట గోవర్ధన్‌రెడ్డి, పంతులు శ్రీనివాస్, సీఐ ఆదిరెడ్డి, తహసిల్దార్లు మందడి మహేందర్‌రెడ్డి, చేపూరి కృష్ణయ్య, డీఎస్డీఓ మగ్బుల్ ఆహ్మమద్, సయ్యద్ హాశం, కౌన్సిలర్ ప్రదీప్ నాయక్, ఎంపీటీసీ ప్రభాకర్‌రావు, రేకుల ప్రభాకర్, కండూరు శ్రీనివాస్, హేమంత్, ఉపేంద్ర స్వామి, జనార్ధన్, దామోదర్, పంతులు మురళి, ప్రకాష్ నారాయణ, పార్ధు, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.