Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-భువనగిరిరూరల్
పశుమిత్రలకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం తెలంగాణ పశుమిత్రల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా డీఆర్డీఓ పీడీ కార్యాలయంలో ఏపీడీి శ్యామలకు పశుమిత్రలు ఎదుర్కుంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న పశుమిత్రులకు వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పశువైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న పశుమిత్రలతో జంతువులకు ఆరోగ్యపరమైన సేవలు ఎలాంటి పారితోషికం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చేయించుకుంటున్నదని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది పశుమిత్రులు ఎనిమిదేండ్ల నుండి సేవలు అందిస్తున్నారన్నారు.ఇందులో మహిళలే ఉన్నారని, వీరికి ఐకేపీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు నిర్ణయించకుండా పశుమిత్రులుగా నియమించారన్నారు.వీరికి తన ఊరుతో పాటు సబ్ సెంటర్ పరిధిలోని జంతువులకు రాత్రనక పగలనక సేవలు అందిస్తున్నారన్నారు.అయినప్పటికీ ప్రభుత్వం పారితోషికం లేకుండా పశుమిత్రలతో వెట్టి చేయించుకోవడం చాలా బాదాకరమన్నారు.వీరికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వేతనం నిర్ణయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పశుమిత్ర యూనియన్ ( సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, బోడ భాగ్య, జిల్లా ఉపాద్యక్షురాలు శ్రీలత, కావ్య, మనిష, నిర్మల, ప్రేమలత, లలిత, లత, అనిత, రామానుజలు పాల్గొన్నారు.