Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవే పరమావధిగా పనిచేయాలి
- ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాలలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేసి, పదవులకే వన్నె తేవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి కోరారు.ఆదివారం అయిన భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ అధ్యక్షతన మండల సర్వేసభ్య సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.ఎమ్మెల్సీగా ఆరేండ్ల కాలంలో తాను రూ.6 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేశానన్నారు.రూ.40 లక్షలు మాత్రం సీసీ రోడ్లకు కేటాయించి, మిగతావి మొత్తం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించానన్నారు. కమ్యూనిటీ భవనాలు సామాజిక భవనాలుగా, మహిళా సంఘాలకు, మహిళలు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతోగానో ఉపయోగ పడతాయన్నారు. తాను మార్చి 29వ తేదీన తన పదవి కాలం అయిపోతుందని, ఇదే నా చివరి సమావేశమని ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.కమ్యూనిటీ హాల్ మంజూరు చేసిన కూడా సర్పంచులు సరైన సమయంలో స్పందించకపోవడంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఒక్కో సర్పంచ్‌కు తాను 50 సార్లు ఫోన్ చేసినట్లు వెల్లడించారు.గ్రామాలలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు రవాణా చార్జీలు రావడంలేదని రామచంద్రపురం సర్పంచ్ భువనగిరి శ్రీనివాస్ ఎంఈఓ నాగవర్ధన్రెడ్డిని ప్రశ్నించారు. రెడ్డినాయక్‌తండా గ్రామంలోని ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామానికి రేషన్ షాప్ మంజూరు చేయాలని రెడ్డినాయక్‌తండా సర్పంచ్ మంజునాయక్ కోరారు. కరోనా కేసులు ఇటీవల నమోదు అవుతున్నాయని వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తుక్కాపూర్ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్ భువనగిరి మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి యామినిని ప్రశ్నించారు.ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం రెండు టీములుగా ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2318 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు, 1045 మందిలో 436 మందికి మందులు పంపిణీ చేశామన్నారు.భువనగిరి పట్టణం మండలంలో కలిపి 1436 మందికి సర్జరీ చేయాల్సి ఉందన్నారు. మండలంలో రెండు సాధారణ ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. కునూరు ఎంపీటీసీ పాశం శివానందు మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలో విద్యార్థులకు మూత్రశాలలో లేవన్నారు, ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేదని, ఉపాధిహామీ చట్టంలో చిన్న చిన్న పొరపాట్లు, సాంకేతిక కారణాలవల్ల డబ్బులు రావడంలేదని, అధికారులు అలసత్వం ఉందని అధికారులను మందలించారు. తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ నోముల పద్మ మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టంలో పనిచేసే కూలీలు నందనం గ్రామానికి డబ్బులు తీసుకోవాల్సి వస్తుందని కూలీలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.సిరివేణికుంట గ్రామ సర్పంచ్ పడాల అనిత మాట్లాడుతూ ఉపాధిహామీచట్టంలో పనిచేసిన వారికి డబ్బులు రావడం లేదన్నారు.గ్రామానికి రేషన్ షాప్ మంజూరు విషయంలో నాలుగేండ్లుగా పోరాటం చేస్తే జనవరిలో మంజూరైందన్నారు.రేషన్ షాపు నిర్వహణకు పాత గ్రామపంచాయతీ బిల్డింగును కేటాయించినా ఇంతవరకు రేషన్ షాప్ ఏర్పాటు తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజలు సుమారు మూడు కిలోమీటర్లు వెళ్లి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతారం సర్పంచ్ చిందం మల్లికార్జున్ మాట్లాడుతూ గ్రామాలలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు రావడంలేదని, 15వ ఆర్థికసంఘం నిధులను అధికారులు కరెంటు బిల్లులకు జమ చేసుకోవడంతో గ్రామపంచాయతీ నిర్వహణ చాలా కష్టమవు తుందన్నారు.మూడు నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.గ్రామాలలో ట్రాక్టర్ నిర్వహణ, ట్రాక్టర్ నడవడానికి డీజిల్, ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోయడం, నర్సరీ నిర్వహణ, గ్రామాలలో శానిటేషన్ చేయించడం, పైపులైన్ రిపేర్, మంచినీటి బోరు రిపేర్ చేయడం ఇలాంటి పనులు చేయాలంటే డబ్బులు లేక, త్రీవ ఇబ్బందులు పడుతు న్నామన్నారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో 42 ఎకరాలలో ఆయిల్ఫామ్ సాగుకు మంజూరైందన్నారు.రాయగిరిలో 10 ఎకరాలు పెంచికలపాడులో 22 ఎకరాలు, నాగిరెడ్డిపల్లి గ్రామానికి 2 ఎకరాలు, ఆరుగురు రైతులు 9:20 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. వీరికి నాలుగేండ్ల పాటు ఎకరానికి రూ.4200 మెయి ంటెనెన్స్ వస్తుందన్నారు.ఆర్ అండ్‌బీ ఏఈ సైదులు మాట్లాడుతూ భువనగిరి ముత్తిరెడ్డిగూడెం బస్వాపురం దాతరపెల్లి రోడ్డుకు రూ.1.20 కోట్లు మంజూర య్యాయన్నారు. భువనగిరి గుర్రాలదండి రోడ్డుకు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయన్నారు.అనాజిపురం టు జంపల్లి రోడ్డు పనులను త్వరలో ప్రారంభిం చనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీకి సన్మానం
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవి కాలం మరో 10 రోజులలో ముగియనుండగా ఎంపీపీ ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీలు శాలువాతో ఆయన్ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ అనురాధాదేవి,ఎంపీటీసీలు బొక్క కొండల్‌రెడ్డి, రాసాల మల్లేష్‌యాదవ్, పాశం శివానంద్, మట్ట పారిజాత శంకర్‌బాబు, గుగులోతు సుజాత, సర్పంచులు రాంపల్లి నగేష్, చిందమ్ మల్లికార్జున్, భువనగిరి శ్రీనివాస్, నోముల పద్మ, పడాల అనిత, మండల అధికారులు పావని, సైదులు, ప్రసాద్, నాగవర్ధన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.