Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎం
మండలంలో శనివారం రాత్రి, ఆదివారం ఈదురు గాలులతో కురిసిన రాళ్లవానకు పంటలు నష్టపోయాయి.పెద్దఎత్తున ఇండ్లు కూలాయి, ఇండ్ల పైకప్పు రేకులు, కోళ్ల ఫారాలు షెడ్లు దెబ్బతిన్నాయి.అక్కడక్కడ చెట్లు కూలి వడగండ్లవానతో మండలంలో అపార నష్టం వాటిల్లింది.రాళ్ల వర్షానికి కూలిన, దెబ్బతిన్న ఇండ్లను కోళ్ల ఫారాలను నష్టపోయిన పంటలను అధికారులు, నాయకులు సందర్శించి పరిశీలించారు.మండలంలో కురిసిన భారీరాళ్ల వర్షానికి తుక్కాపురం గ్రామంలో 30 ఇండ్లసిమెంటు రేకుల, కోళ్ల ఫారం షెడ్లు రేకులకు రంద్రాలు పడ్డాయి. సింగారం గ్రామంలోని జంపాల కిష్టయ్య తీరేపాక గ్రామంలో ఏనుతల రాములు మొరిపిరాల గ్రామంలో వంగరి సత్యనారాయణ పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తహసీల్దార్ జయమ్మ తెలిపారు.మండలంలో వరి, మామిడి, కూరగాయల పంటలు సుమారు 978 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, వర్షం కారణంగా ఇంకా కొన్ని గ్రామాల్లో పంట నష్టవిచారణ జరగడం ఆలస్యం అవుతుందని వ్యవసాయ శాఖ ఆలేర్ డివిజన్ ఏ డీఏ వెంకటేశ్వర్లు, ఎంఏఓ శిల్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయి,కోడి నగేష్, రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, గ్రామ కో ఆర్డినేటర్ నాతిరాజు,ఆర్ఐ సీహెచ్.యాదగిరి, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్రూరల్ : అకాల వర్షం రైతులను నష్ట పరిచింది.చౌటుప్పల్ మండలంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉన్న వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది.పెద్ద పెద్ద ఉరుములు,మెరుపులతో రాళ్ళ వాన కురిసింది.ఎస్.లింగోటం, మందోల్లగూడెం, పంతంగి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో అకాల వర్షం పంట నష్టం కలిగించింది.ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షంతో పంట పొలాల్లో వడ్లు రాలిపోయాయి. ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. రాలిన వడ్లను చూసి రైతులు ఆందోళన పడుతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షంతో పొలాల్లోనే రాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. రాళ్లతో కూడిన వర్షం గ్రామాల్లోని రైతులను నష్టపరిచింది.ఎస్ లింగోటం గ్రామంలో ఓ రైతు పొలంలో దాదాపు వడ్లన్నీ రాలిపోయాయి. దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు.
వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కష్ణారెడ్డి
అకాల వర్షాలతో మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు నష్టపోయారు.వరి పొలాల్లో వడ్లని రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వ అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.అకాల వర్షంతో రైతన్న ఆగమయ్యారు.
మోత్కూరు:మోత్కూరు మండలంలో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన కురవడంతో వరి చేలల్లో ధాన్యం రాలిపోగా, మామిడి తోటల్లో పూత, కాత నేలరాలింది. సుమారు అరగంటకు పైగా సీసం గోలీల సైజులో వడగండ్లు కురవడంతో మండలంలో వరి చేలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. మండలంలోని పనకబండ గ్రామంలో కోతకు వచ్చిన కౌలు రైతు బత్తిని శ్రీనుకు చెందిన నాలుగు ఎకరాల వరి చేనులో 90శాతం మేర ధాన్యం రాలిపోయింది. అప్పు చేసి సాగుచేసిన పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో ఆ కౌలు రైతు చేనును చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. మండలంలోని దాచారం గ్రామంలో రైతు అండెం పిచ్చిరెడ్డి మామిడి తోట, రైతు రామకృష్ణ కౌలుకు తీసుకున్న అండెం మధుకర్ రెడ్డి పది ఎకరాల నిమ్మతోటలో కాయలు రాలిపోయాయి. వడగండ్లతో వరి పంట దెబ్బతిన్న తమను ఆదుకోవాలని రైతులు శ్రీను, పన్నాల శ్రీనివాస్ రెడ్డితో పాటు పంటలు నష్టపోయిన రైతులు కోరారు. పాటిమట్ల గ్రామంలో ఎడవెల్లి సాగర్ సందీప్ ఇంటి పైకప్పు ఈదురుగాలులకు లేచిపోయింది. వడగండ్ల వానతో మండలంలో 450 ఎకరాల్లో వరి పంట, 50 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిని నష్టం జరిగిందని ఏవో స్వప్న, హార్టికల్చర్ అధికారి నసీమా తెలిపారు. వడగండ్ల దెబ్బతిన్న వరి చేలను ఆలేరు ఏడీఏ వెంకటేశ్వర్ రావు, ఏవో స్వప్న, ఏఈవో గోపీనాథ్ పరిశీలించారు.
బొమ్మలరామారం : మండలంలోని రెండు రోజులుగా ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుంది.కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు గ్రామాలలో టమాట,మామిడి,కొత్తిమీర కాకరకాయ, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో రైతు కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.మండలంలోని మర్యాల గ్రామంలో కొత్తిమీర, కాకరకాయ,పంట అకాల వర్షంతో చేతికి రాకుండా రెండు ఎకరాల పంట పొలం నష్టపోయిందని రైతు చీర మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు.ఇబ్బందులు పడుతూ,పగలు రాత్రి కష్టపడి నిరంధించిన కొత్తిమీర అప్పు చేసి పెట్టుబడి పెడితే వడగళ్ల వర్షాలు వల్ల తీరిన నష్టం ఏర్పడిందని తెలిపారు.పకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
రామన్నపేట : చేసిన కష్టం చేతికి అందేదాకా రైతు కష్టాలు పడక తప్పదు. కనిపించని దేవుళ్ళకు దండం పెడుతూ ఎదురుచూస్తూనే ఉంటారు... అలాంటి రైతులకు అకాల వర్షాలు, వడగండ్ల వానలు అపార నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఆదివారం మండలంలోని రామన్నపేట, కొమ్మయిగూడెం, సిరిపురం, వెల్లంకి తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడిన వడగండ్ల వాన కురవడంతో చేతికి అంది వచ్చిన వరి పంట చెళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలు పోసుకొని గట్టి గింజగా మారిన వడ్లు రాళ్ల దెబ్బకు రాలి నేలపాలయ్యాయి. నిండు పొట్ట మీద ఉన్న వరి చెళ్లు వడగండ్ల రాళ్ల దెబ్బ పొట్టలు పగిలి పోయాయి. సీసపు గుడి సైజులో వడగండ్లు పడడంతో రైతులు తీవ్ర భయాందోళనకుడయ్యారు. ఇండ్లల్లో ఉండే ప్రజలు వడగండ్ల రాళ్ల దెబ్బకు ఇండ్ల పైకప్పులు అదిరిపోవడంతో వణికిపోయారు. అర్థగంట సేపు కురిసిన ఈ వడగండ్ల వాన ఆగిపోవడంతో రైతులు హుటాహుటిన వరి పంటచెళ్లకు చేరుకొని రాలిపోయిన వడ్లను, దెబ్బతిన్న వరి పంటను చూసి కన్నీరు పెట్టుకున్నారు. వడగండ్ల వాన కురవడం వల్ల మండలంలోని సిరిపురం, వెల్లంకి, కొమ్మాయిగూడెం, రామన్నపేట గ్రామాల పరిధిలోని చేతికొచ్చిన వందల ఎకరాలలోని వరి పంట దెబ్బతిన్నట్లు అనధికార సమాచారం మేరకు తెలుస్తోంది.అధికారులు సోమవారం వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించినట్లు సమాచారం.