Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నిడమనూరు
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీకి కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నిడమనూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ జయప్రదానికై ఆదివారం మండల కేంద్రంలో ఐక్య మండల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ హాజరైన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని, యాటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాలు చేసిన మోడీ వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఈ విధానాలను ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల 3వేల 97 కోట్ల బడ్జెట్లో సంక్షేమ రంగాన్ని విస్మరించి కార్పొరేట్లకు దోచి పెట్టేదిగా ఉందని విమర్శించారు. కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలపై, మతోన్మాద రాజకీయాలపై ప్రజలు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ ప్రచార క్యాంపెయిన్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవాలని అందుకోసం జనరల్ బాడీలు, సభలు, సమావేశాలు, జీపు జాతాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కందుకూరి కోటేష్, రైతు సంఘం జిల్లా నాయకులు నల్లబోతు సోమయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, సీఐటీయూ నాయకులు కోదండ చరణ్‌రాజ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కోరే రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కుంచం శేఖర్, తగుళ్ల కోటయ్య, కడారి వెంకన్న, కన్నబోయిన శ్రీను, ముంత మారయ్య, జక్కల పాపయ్య, గన్నేబోయిన కొండల్, వింజమూరు పుల్లయ్య దితరులు పాల్గొన్నారు.