Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
బీజేపీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజికన్యాయం కోసం సీపీఐ(ఎం) అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా మార్చి 25,26వ తేదీలలో జిల్లావ్యాప్తంగా జరిగే జనచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డిభవన్లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కేంద్ర బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మోడీ, అమిత్‌షాల నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ.లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు.దేశమంటే అంబానీ, అదానిల తొత్తుగా బీజేపీ ప్రభుత్వం మార్చివేసిందన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నూనెల ధరలు మూడు రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని విమర్శించారు.ఒకే భాష పేరుతో హిందీ, సంస్కృతాన్ని ప్రజలపై రుద్దుతున్నారని తెలిపారు. విద్యలో జ్యోతిష్యాన్ని,సంస్కృతాన్ని పాఠ్యాంశాలుగా మార్చారన్నారు.రాజ్యాంగయంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తినే తిండిపై, వేసుకునే బట్టలపై ఆధిపత్యం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.రాష్ట్రంలో మతవిధ్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందన్నారు.ఆ కలలను కల్లోలు చేసే సత్తా రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉందన్నారు.కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జన చైతన్య యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందన్నారు.అందులో భాగంగా మార్చి 25వ తేదీన జన చైతన్య యాత్ర జిల్లాలోని కోదాడ మండలం శాంతినగర్‌లో ప్రవేశిస్తుందన్నారు.ఈ సందర్భంగా ఈనెల 25న కోదాడ,హుజూర్నగర్ పట్టణ కేంద్రాల్లో భారీ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.26న నేరేడుచర్ల పట్టణకేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభలకు బీజేపీయేతర శక్తులు, వామపక్ష శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని కోరారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్,జిల్లాపల్లి నర్సింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, చిన్నపంగనర్సయ్య పాల్గొన్నారు.