Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణంలో కరపత్రాల పంపిణీ
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికే ఏప్రిల్ 5న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి రైతాంగం, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని 43 వ వార్డు ప్రభుత్వ హాస్పిటల్ సర్కిల్లో కరపత్రం విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని, యాటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాలు చేసిన మోడీ వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని, ఈ విధానాలను ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న మూడు సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలపై, మతోన్మాద రాజకీయాలపై ప్రజలు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు పాలాది కార్తిక్, సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సాగర్ల యాదయ్య, గడ్డం రాములు, రామకృష్ణారెడ్డి, మారయ్య, గనిపల్లి రాములు, నాయిని నరసమ్మ, చెరుపల్లి శివమ్మ, శ్యామల ప్రసన్న, మేరెడ్డి నీలమ్మ, నాయిని రాజు తదితరులు పాల్గొన్నారు.