Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరిగుట్టలో భక్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీపుష్కరిణిలో మంగళవారం ఉదయం స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ రావడంతో.. గుండంలోని నీటిలో మునిగి ఓ భక్తుడు చనిపోయాడు. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం అమరచింత గ్రామానికి చెందిన సయ్యద్ మౌలాలి(19) తల్లితో కలిసి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం సోమవారం సాయంత్రం యాదగిరిగుట్టకు వచ్చాడు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకునే ప్రక్రియలో భాగంగా.. స్నానం చేయడం కోసం తల్లీకొడుకులు కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణి వద్దకు వెళ్లారు. గుండంలో తల్లి స్నానం ముగించుకుని చీర మార్చుకోవడం కోసం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లింది. ఇదే సమయంలో గుండంలో స్నానం చేస్తున్న కొడుకు మౌలాలికి ప్రమాదవశాత్తు ఫిట్స్ రావడంతో.. పుష్కరిణిలోని నీటిలో పడిపోయాడు. నీటిలో పడడాన్ని ఎవరూ గమనించకపోవడంతో.. నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భువనగిరి ఏరియా హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహించి బాధిత ఫ్యామిలీకి అప్పగించారు.
పుష్కరిణిలో సంప్రోక్షణ పూజలు
యాదగిరిగుట్టలో భక్తులు స్నానం చేయడం కోసం ఏర్పాటు చేసిన లక్ష్మీపుష్కరిణిలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయిన కారణంగా.. గుండంలోని నీటిని మొత్తం ఖాళీ చేసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం గుండంలో కొత్త నీటిని నింపి స్నానాలు చేయడానికి భక్తులను అనుమతించారు.