Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం నేరేడుచర్లలోని అరిబండిభవన్లో నిర్వహించిన నేరేడుచర్ల పట్టణ,మండల కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం ప్రజాస్వామ్యం సామాజిక న్యాయపరిరక్షణ కోసం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్యయాత్రలను జయప్రదం చేయాలని కోరారు.మోడీ, అమిత్షా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రూ.లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతూ దేశమంటే అంబానీ, ఆదానిలా సొత్తుగా మార్చేశారన్నారు.నిత్యావసరధరలు, పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ కార్పొరేట్లకు వేలకోట్ల రూపాయల లాభాలను దోచిపెడుతుందన్నారు.రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టి బలోపేతం చేసిన ప్రభుత్వ రంగసంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని, భూములను, మార్కెట్లను, పరిశ్రమలను ఉపాధి కల్పించే రంగాలను పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు.అత్యంత ప్రమాదకరమైన విద్యుత్చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తుందన్నారు.మోడీ విధానాల వల్ల ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, ఏకకాలంలో రుణమాఫీలు చేయాలని, 2006 అటవీ హక్కు చట్టప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని రైతాంగం కోరుతున్నాప్పటికి కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.ఒకే భాష పేరుతో హిందీ సంస్కృతాన్ని రుద్దుతున్నారన్నారు.విద్యలో జ్యోతిష్యాన్ని సంస్కృతాన్ని పాఠ్యాంశాలుగా మార్చారని, ఒకే మతం అంటూ హిందూయేతర మతాలపై దాడులు సాగిస్తున్నాయన్నారు.రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ న్యాయవ్యవస్థను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల నిరంకుశ వైఖరి కొనసాగిస్తూ ప్రజలను మతాలపేర, కులాలపేర, భాషల పేర విధ్వేషాలను రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు.అందుకే అనేక బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్,సీహెచ్.నర్సయ్య, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, నాయకులు కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, కట్ట మధు, మర్రినాగేశ్వరరావు, అల్వాల శ్రీధర్, ముశం.నర్సింహ, మామిడి నాగసైదులు, బుడిగ ధనుంజయ, వాసా సంపత్, చలసాని అప్పారావు, అనెగంటి. మీనయ్య,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.